- మలేషియాలోని ఎఫ్‌జీవీ కంపెనీని కోరిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో సొంతంగా ఆయిల్ పామ్ మొక్కలను తయారు చేసే సీడ్ గార్డెన్ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సాగు విస్తరణ స్టడీ కోసం వ్యవసాయ హార్టికల్చర్ అధికారులతో కలసి ఆయన మలేషియా వెళ్లారు. పర్యటనలో భాగంగా గురువారం ఎఫ్‌జీవీ కంపెనీ సీడ్ గార్డెన్, నర్సరీలను, అధునాతన సాంకేతిక పద్ధతులతో నడపుతున్న విత్తన కేంద్రాన్ని మంత్రి సందర్శించి, అక్కడే కంపెనీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఎఫ్‌జీవీ కంపెనీ నుంచి తెలంగాణ ఇప్పటికే సీడ్ లింగ్స్ను తెప్పించామని.. భవిష్యత్తులో రాష్ట్రంలోనే సొంతంగా సీడ్ గార్డెన్ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.
దీనికి ఎఫ్‌జీవీ కంపెనీ సహాయ సహకారాలు అందజేయాలని కోరారు. కంపెనీ ప్రతినిధులు తెలంగాణతో పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినట్లు మంత్రి వెల్లడించారు. అనంతరం ఎఫ్‌జీవీ కంపెనీ రిఫైనరీ కర్మాగారాన్ని సందర్శించి, అక్కడ తయారు చేసే వివిధ ఉత్పత్తులను మంత్రి బృందం పరిశీలించింది. పహాంగ్ రాష్ట్రం జెరంటుట్ లో ఆయిల్ పామ్ సీడ్ గార్డెన్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్‌ను కూడా పరిశీలించింది. నవభారత్ కెమికల్స్ సీఈవో కల్యాణ్ చక్రవర్తితో మంత్రి భేటీ అయ్యారు. మలేషియా వ్యాపార, వాణిజ్య రంగాల్లో ట్రెండ్స్‌ను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్‌రావు, హార్టీకల్చర్ డైరెక్టర్ యాస్మిన్ బాషా పాల్గొన్నారు.