
- మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం టౌన్, వెలుగు : కేంద్రంలో బీజేపీ పాలకులు రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం జింకలతండాలో శనివారం నిర్వహించిన ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ కార్యక్రమంలో ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు.
బీజేపీ పాలకులు ప్రజల హక్కులకు భంగం కలిగిస్తున్నారన్నారు. అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తూ, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. అప్రజాస్వామిక పాలన సాగిస్తున్న బీజేపీ విధానాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్రలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
మౌలిక వసతుల కల్పనకు కృషి
ఖమ్మం నగరంలోని దొరన్న కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎంపీ రఘురాంరెడ్డితో కలిసి ఖమ్మం నగరంలో ఆయన పర్యటించారు. ప్రకాశ్‌నగర్ లో ఏర్పాటు చేసిన కోల్డ్ స్టోరేజ్ ని ప్రారంభించారు. 58వ డివిజన్ దొరన్న కాలనీలో రూ.కోటితో చేపట్టిన సీసీ రోడ్డు, స్మార్ట్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దొరన్న కాలనీలో కావాల్సిన మేరకు పెండింగ్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు.
మొదటి విడతలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఎంపీ రఘురాంరెడ్డి మాట్లాడుతూ గత 16 నెలలుగానే ఖమ్మం నగరం అభివృద్ధిలో పరుగులు పెడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పూనుకొల్లు నీరజ, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, కార్పొరేటర్ దొరేపల్లి శ్వేత, ఖమ్మం ఆర్డీఓ నరసింహా రావు, ఖమ్మం నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ షఫీ ఉల్లా, ఖమ్మం అర్బన్ మండల తహసీల్దార్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.