పాలమూరు పెండింగ్​ ప్రాజెక్టుల కాంట్రాక్టర్లూ రావాలని ఆదేశాలు : మంత్రి ఉత్తమ్​

పాలమూరు  పెండింగ్​ ప్రాజెక్టుల కాంట్రాక్టర్లూ రావాలని ఆదేశాలు :  మంత్రి ఉత్తమ్​

హైదరాబాద్​, వెలుగు:  ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఇరిగేషన్​ ప్రాజెక్టులపై ఫోకస్​ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు అనుగుణంగా కసరత్తులను చేస్తున్నది. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టులపై బుధవారం జలసౌధలో అధికారులతో ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ సమీక్ష నిర్వహించనున్నారు.

పెండింగ్​లో ఉన్న పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీములతో పాటు నెట్టెంపాడు, భీమా, కోయిల్​సాగర్​, ఆర్డీఎస్​ వంటి ప్రాజెక్టు పనుల పురోగతి గురించి చర్చించనున్నారు. సీఎం రేవంత్​ రెడ్డి నియోజకవర్గంలో చేపట్టనున్న కొడంగల్​ నారాయణపేట లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్​పైనా మీటింగ్​లో చర్చించే అవకాశమున్నట్టు తెలిసింది. టెండర్ల దాఖలుకు గడువు, పెట్టాల్సిన నిబంధనలపై చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఈ సమావేశానికి ఇప్పటికే పనులు మొదలై పెండింగ్​లో పడిపోయిన ప్రాజెక్టులకు సంబంధించిన కాంట్రాక్ట్​ సంస్థలనూ రావాల్సిందిగా ఆదేశించినట్టు తెలిసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఎంత సమయం పడుతుంది? ఎన్ని నిధులు కావాలి? పెండింగ్​ నిధులెన్ని? ఆయకట్టు పెంపు వంటి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని వివరాలను సిద్ధం చేసి పెట్టారు. వాస్తవానికి ఈ రివ్యూ సోమవారమే జరగాల్సి ఉన్నా పలు కారణాలతో బుధవారానికి వాయిదా వేశారు.