- ఇందుకోసం రూ.11 వేల కోట్లు ఖర్చు చేయనున్నం
- అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డు ఇస్తం: మంత్రి ఉత్తమ్
- వీ6 ఇంటర్వ్యూలో సివిల్ సప్లయ్స్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు : ఎలాంటి అపోహలు, అనుమానాలకు తావులేదనీ.. అర్హులైన ప్రతీ కుటుంబానికి రేషన్ కార్డు అందిస్తామని సవిల్ సప్లయ్స్, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. లిస్టులో పేరు లేనివాళ్లు ప్రజాపాలన సేవా కేంద్రం, గ్రామ సభలో అప్లై చేసుకోవాలని సూచించారు.
గతంలో అప్లై చేసుకున్న వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామనీ హామీ ఇచ్చారు. కొత్త రేషన్ కార్డుల జారీ, పేర్లు చేర్చడం నిరంతర ప్రక్రియ అని చెప్పారు. త్వరలో ప్రతి లబ్ధిదారునికి ఆరు కిలోల చొప్పన సన్నబియ్యం ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తెలిపారు. సోమవారం ‘వీ6’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేషన్ కార్డులు, కృష్ణా ట్రిబ్యునల్ అంశాలపై మాట్లాడారు.
విప్లవాత్మకమైన అడుగు వేయబోతున్నం
40 లక్షల మందికి లబ్ధి జరిగేలా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎంత మంది అర్హులు ఉంటే అంతమందికి ఇవ్వాలని తాము చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇప్పటికే ఉన్న కార్డుల్లో పేర్లు చేర్చే ప్రక్రియ కూడా కొనసాగుతుందని చెప్పారు. ఆహార భద్రత విషయంలో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ‘‘ప్రస్తుతం రాష్ట్రంలో 90 లక్షల రేషన్ కార్డులు ఉండగా 2.81కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నరు.
దేశంలో ఎక్కడా లేని విధంగా లబ్ధిదారులకు ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యం అందిస్తం. సన్నబియ్యం ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాపై రూ.11వేల కోట్ల భారం పడనున్నది.. అయినా ఇవ్వడానికి సిద్ధమయ్యాం. ప్రతీ నిరుపేద కడుపు నిండాలనేదే మా ఉద్దేశం. దొడ్డు బియ్యంతో జరిగే ఇల్లీగల్ దందాలకు చెక్ పెట్టబోతున్నం” అని ఉత్తమ్ స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలది దుష్ర్పచారం
కేసీఆర్ పాలనలో కృష్ణా జలాల నీటి వాటాల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఉత్తమ్ విమర్శించారు. ‘‘అధికారం కోల్పోయి బీఆర్ఎస్ నేతలు ఏది పడితే అది మాట్లాడుతున్నరు. కృష్ణా ట్రిబ్యునల్ విషయంలో హరీశ్‌రావు మాటలు అర్థరహితం. ఆయన చిల్లర రాజకీయాలు చేస్తున్నరు. కృష్ణా నీళ్ల వాటాలో 299 టీఎంసీలకు కేసీఆర్, హరీశ్ సంతకాలు పెట్టారు. తెలంగాణకు 34 శాతం, ఏపీకి 66 శాతం నీళ్లు అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పుకుంది. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. వాటిని బయటపెడుతా. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తెలంగాణకు 70 శాతం, ఏపీకి 30 శాతం వెళ్లాలని ట్రిబ్యునల్ ముందు డిమాండ్ చేస్తున్నది” అని అన్నారు. ట్రిబ్యూనల్ ముందు తాను స్వయంగా హాజరై 299 టీఎంసీలు ఒప్పుకోవడం లేదని చెప్పాన్నారు.
కాళేశ్వరం విచారణ రెండు నెలల్లో పూర్తవుతుంది
జస్టిస్ ఘోష్ ఆధ్వర్యంలో కాళేశ్వరంపై కొనసాగుతున్న విచారణ రెండు మూడు నెలల్లో పూర్తవుతుందని ఉత్తమ్ చెప్పారు. ‘‘కాళేశ్వరం మానస పుత్రిక అని కేసీఆర్ చెప్పారు. ఆ ప్రాజెక్టు అద్భుతం.. రూ.లక్షకోట్లతో కడుతున్నం అన్నరు. కానీ నాలుగేండ్లు కూడా కాకుండానే వాళ్ల హయాంలోనే అది కూలింది”అని అన్నారు. బీఆర్ఎస్ రోజురోజుకు ఉనికి కోల్పోతున్నదని.. బీఆర్ఎస్లో గెలిచిన మూడో వంతు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు సానుకూలంగా ఉన్నారని చెప్పారు.