
- మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్ నగర్, వెలుగు : రాష్ట్రంలోని పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మార్చి 16, 17, 18 తేదీల్లో కోదాడలో జరిగే రాష్ట్రస్థాయి సంక్షేమ క్రీడా పోటీల వాల్ పోస్టర్ ను గురువారం హుజూర్ నగర్ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
పెన్షనర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావెళ్ల సీతారామయ్య ఆధ్వర్యంలో పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీ పెండింగ్, డీఏ తదితర సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లు రాంబాబు, నాయకులు దేవదానం, ఎం ఎస్ ఎన్ రాజు, వీరబాబు, తాటి ప్రభాకర్ రెడ్డి, చంద్రశేఖర్, చంద్రయ్య, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.