
- ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంత్రి ఉత్తమ్ పిలుపు
హైదరాబాద్, వెలుగు: పేదలకు పూర్తి స్థాయిలో ఆహార భద్రత కల్పించేందుకే సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చేపట్టామని సివిల్సప్లయ్స్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇది చరిత్రాత్మక పథకమని పేర్కొన్నారు. ఏటా రూ.13 వేల కోట్ల ఖర్చుతో 30 లక్షల టన్నుల సన్నబియ్యం పేదలకు పంపిణీ చేస్తామని వెల్లడించారు. శుక్రవారం సెక్రటేరియెట్నుంచి ప్రజాప్రతినిధులు, కలెక్టర్లతో ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొనాలని, లబ్ధిదారుల ఇండ్లలో భోజనం చేయాలని ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.
ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ‘‘ఉగాది రోజున సీఎం రేవంత్ సన్నబియ్యం పంపిణీని ప్రారంభించారు. దీనికి ప్రజల నుంచి విస్తృత ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో 99% మేర పంపిణీ పూర్తయింది” అని తెలిపారు. బియ్యం సరఫరాకు అవసరమైన రవాణా సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. సన్న బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూడాలని, అక్రమాలకు పాల్పడినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్హులందరికీ త్వరలోనే రేషన్ కార్డులు మంజూరు చేస్తామని తెలిపారు. కొత్తగా 30 లక్షల మందికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పారు.
లబ్ధిదారుడి ఇంట్లో ఉత్తమ్ భోజనం..
సూర్యాపేట, వెలుగు: సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో ప్రజలంతా సంబురాలు చేసుకుంటున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆ బియ్యంతో వండిన అన్నం తినడానికి తమ ఇండ్లకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి సహా ప్రజాప్రతినిధులను ప్రజలు ఆహ్వానిస్తున్నారని చెప్పారు. శ్రీరామ నవమి రోజున భద్రాచలంలో సీతారాముల కల్యాణం తర్వాత సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి భోజనం చేస్తారని తెలిపారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో సన్నబియ్యం లబ్ధిదారులు పాలడుగు బుజ్జమ్మ, వెంకటయ్య దంపతుల ఇంట్లో సన్న బియ్యంతో వండిన భోజనాన్ని ఉత్తమ్ తిన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా ప్రతినిధులందరూ సన్నబియ్యం లబ్ధిదారుల ఇండ్లలో భోజనం చేస్తారని ఆయన తెలిపారు.