నల్గొండ రైతులు కేటీఆర్​ను చెప్పులతో కొడతరు : మంత్రి వెంకట్​రెడ్డి

నల్గొండ రైతులు కేటీఆర్​ను చెప్పులతో కొడతరు : మంత్రి వెంకట్​రెడ్డి
  • రైతుల పక్షాన ధర్నా చేసే అర్హత బీఆర్ఎస్​కు లేదు: మంత్రి వెంకట్​రెడ్డి

నల్గొండ, వెలుగు : రైతుల పక్షాన ధర్నా చేసే అర్హత బీఆర్ఎస్ కు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. నల్గొండలో కేటీఆర్​ రైతు ధర్నా చేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు. ధర్నా చేస్తే  రైతులు కేటీఆర్ ను చెప్పులతో కొడతారని హెచ్చరించారు. సోమవారం నల్గొండ జిల్లా కనగల్ మండలం ధర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్ రైతు మహా ధర్నా చేసేందుకు నల్గొండే దొరికిందా? అని ప్రశ్నించారు. 

మొదట ఆయన సిరిసిల్లలో చేయాలని సూచించారు. గత బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంటో జిల్లా రైతులకు తెలుసని, ఏం మొఖం పెట్టుకొని నల్గొండలో రైతు మహా ధర్నాని చేస్తారని ప్రశ్నించారు. ఏం చేసినా కేటీఆర్ ను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పదేండ్లు పాలించి.. వందేండ్లు వెనక్కు నెట్టిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్.. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలు తర్వాత మిగిలిన పార్టీలు కనుమరుగవుతాయన్నారు.

 జిల్లా ప్రజల చిరకాల వాంఛ​అయిన ఎస్ఎల్బీసీ  సొరంగమార్గానికి పదేండ్ల పాలనలో నయా పైసా కేటాయించలేదని, కమీషన్ల కోసమే గత ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మించిందని విమర్శించారు. మార్చిలో ఎస్ఎల్బీసీ సొరంగ పనులను మొదలుపెట్టి రెండేండ్ల పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో 2014 కంటే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఫ్లోరైడ్ అధికమైందని విమర్శించారు. మరో రెండేండ్లలో యాక్సిడెంట్ ఫ్రీగా జాతీయ రహదారి 65 ని అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు. అనుకున్న షెడ్యూల్ ప్రకారం ట్రిపుల్ ఆర్ పనులు మొదలవుతాయన్నారు.  

బీఆర్ఎస్ రైతు మహా ధర్నా రద్దు..

నల్గొండ జిల్లా కేంద్రంలో మంగళవారం బీఆర్ఎస్​నిర్వహించతలపెట్టిన రైతు మహాధర్నా రద్దయింది. క్లాక్ టవర్ సెంటర్​లో పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో పెట్టుకొని ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, కోర్టులో వారికి చుక్కెదురైంది. విచారణను కోర్టు ఈ నెల 27కు వాయిదా వేసింది.