- నిరుడితో పోలిస్తే 2.5 శాతం మాత్రమే పెంపు
- ఆ శాఖకు రూ. 26,092 కోట్లు కేటాయింపు
- మహిళల వర్క్‌ఫోర్స్‌ను పెంచేందుకు వర్కింగ్ విమెన్ హాస్టల్స్ ఏర్పాటు
న్యూఢిల్లీ: బడ్జెట్లో కేంద్ర సర్కారు మహిళా, శిశు సంక్షేమానికి అంతంత మాత్రమే కేటాయింపులు చేసింది. నిరుడితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను 2.5శాతం మాత్రమే పెంచింది. తాజా బడ్జెట్లో మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు రూ. 26,092 కోట్లు కేటాయించింది. నిరుడు ఈ శాఖకు రూ. 25,448 కోట్ల కేటాయింపు చేశారు.
కాగా, మహిళల నేతృత్వంలోని అభివృద్ధిని ప్రోత్సహించేందుకు వివిధ మంత్రిత్వ శాఖల్లో మహిళలు, బాలికలకు ప్రయోజనం చేకూర్చే పథకాల కోసం బడ్జెట్లో రూ. 3లక్షల కోట్లకు పైగా కేటాయింపులు చేసినట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. మహిళల వర్క్‌ఫోర్స్‌ను పెంచేందుకు వర్కింగ్ విమెన్హాస్టల్స్ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ చర్యలు ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్రను పెంపొందించడంలో కేంద్ర ప్రభుత్వ నిబద్ధతను సూచిస్తాయని పేర్కొన్నారు.
కేటాయింపులు ఇలా..
- విమెన్ హాస్టల్స్, స్వధార్ గృహాలు, ప్రధాన మంత్రి మాతృ వందన యోజనలాంటి ప్రాజెక్టుల కోసం ఉద్దేశించిన సబ్ స్కీమ్ ‘సామర్థ్య’ కోసం రూ. 2,516 కోట్ల కేటాయింపులు చేశారు.
- చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడంతో పాటు బాలల సంరక్షణకు ఉద్దేశించిన ‘సాక్షమ్ అంగన్వాడీ’, ‘పోషణ్ 2.0’ స్కీమ్స్ కోసం రూ. 21,200 కోట్లు కేటాయించారు.
- శిశు సంరక్షణ సేవలు, సంక్షేమం కోసం అమలు చేస్తున్న ‘వాత్సల్య మిషన్’కు రూ. 1,472 కోట్ల కేటాయింపులు చేశారు.
- మహిళల భద్రత కోసం ఉద్దేశించిన వన్‌స్టాప్ సెంటర్స్, బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమాలతో కూడిన ‘సంబాల్’ సబ్‌స్కీమ్ కోసం రూ. 629 కోట్లు కేటాయించారు.
- శిశు అభివృద్ధిలో పరిశోధన,శిక్షణ కోసం ఏర్పాటు చేసిన ఎన్ఐపీసీసీడీకి రూ. 88.87 కోట్లు, చైల్డ్ అడాప్షన్స్కు బాధ్యత వహించే సీఏఆర్ఏకు రూ. 11.40 కోట్ల కేటాయింపులు చేశారు.
- యునిసెఫ్‌కు దేశ సహకారంగా రూ. 5.60 కోట్లు, నిర్భయ ఫండ్కోసం రూ.500 కోట్లు కేటాయించారు.