
రాకెట్ మాదిరిగా ప్రయాణిస్తూ అధిక వేగంతో కచ్చితత్వంతో నిర్దేశిత లక్ష్యాలు నాశనం చేసే పేలుడు పదార్థాన్ని మోసుకెళ్లడానికి రూపొందించిన ఆయుధాన్ని క్షిపణి అంటారు. సాధారణ పరిభాషలో క్షిపణి అనే పదం లక్ష్యం వైపు విసిరిన, ప్రయోగించిన లేదా ప్రొపెల్లర్ల సాయంతో ముందుకు పయనించే ఏదైనా ప్రొజెక్టైల్‌ను క్షిపణి అనవచ్చు. క్షిపణుల ప్రయోగ స్థానం నుంచి అవి ఛేదించగల లక్ష్యం ఉన్న స్థానానికి మధ్య గల కనిష్ట దూరాన్ని ఆ క్షిపణుల వ్యాప్తి అంటారు.
కొన్ని క్షిపణుల వ్యాప్తి యుద్ధ క్షేత్ర పరిధిలోనే కొన్ని వందల అడుగుల వరకు ఉంటే మరికొన్ని క్షిపణుల వ్యాప్తి యుద్ధ క్షేత్ర పరిధిలో బయట కొన్ని వందల నుంచి వేల కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. అన్ని క్షిపణులు కొన్ని రకాల మార్గదర్శకత్వం, నియంత్రణ యంత్రాంగాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని తరచూ గైడెడ్ క్షిపణులుగా సూచిస్తారు. ఘన లేదా ద్రవ ఇంధనాన్ని ఉపయోగించే రాకెట్లు లేదా జెట్ ఇంజిన్లు ఈ క్షిపణులను నిర్ధారిత లక్ష్యం వైపు నడిపిస్తాయి. కొన్ని క్షిపణులు నిర్దేశిత స్థానానికి నడిపించడానికి హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగిస్తాయి.
యుద్ధ క్షేత్రంలోని లక్ష్యాలపైకి ప్రయోగించగలిగే క్షిపణుల్లో ఘన ఇంధనానికే ప్రాధాన్యత ఇస్తారు. ప్రయోగ సమయంలో ఘన ఇంధనానికి పేలిపోయే అవకాశం తక్కువ, శీఘ్రంగా ప్రయోగానికి సిద్ధంగా ఉంచవచ్చు. ఇలాంటి ఇంజిన్లను కలిగిన క్షిపణులను సాధారణంగా టాక్టికల్ గైడెడ్ మిసైల్స్ అని అంటారు. తక్షణ యుద్ధ అవసరాలకు ఉద్దేశించిన టాక్టికల్ గైడెడ్ మిసైల్స్ ధ్వని వేగానికి రెట్టింపు వేగంతో వాటి లక్ష్యాల వైపునకు దూసుకుపోతాయి.
స్వతహాగా వీటి పరిధి చాలా తక్కువగా ఉంటుంది. యుద్ధ క్షేత్రానికి బయట ఉన్న లక్ష్యాలను ఛేదించడానికి రూపొందించిన క్షిపణులను స్ట్రాటజిక్ మిసైల్స్ అంటారు. వీటి పరిధి కొన్ని వందల నుంచి వేల కిలోమీటర్లు ఉంటుంది. స్ట్రాటజిక్ గైడెడ్ మిసైల్‌లో క్రూయిజ్ లేదా బాలిస్టిక్ క్షిపణులు అని రెండు రకాలు ఉన్నాయి. సాధారణంగా స్ట్రాటజిక్ మిసైల్స్ అణువార్ హెడ్లను మోసుకెళ్తుండగా, టాక్టికల్ మిసైల్స్ అధిక పేలుడు పదార్థాలను కలిగి ఉంటాయి. నీటి అడుగున ప్రొపెల్లర్ సహాయంతో నడిచే క్షిపణిని టార్పెడో అంటారు. ఎలాంటి స్వీయ ప్రొపల్షన్ లేకుండా, ఫిరంగులతో గాలిలోకి కాల్చిన పేలుడు పరికరాలను షెల్స్ అని, విమానాలు, హెలికాప్టర్ల నుంచి విసరగల పేలుడు వస్తువులను బాంబులు అని పిలుస్తారు.
క్షిపణుల వర్గీకరణ
క్షిపణులను రేంజ్, ట్రాజెక్టరీ, లాంచ్ మోడ్, ఇంధనం, గైడెడ్ సిస్టమ్, వార్ హెడ్లు తదితర ఆధారంగా వర్గీకరిస్తారు.
ట్రాజెక్టరీని అనుసరించి క్షిపణులను రూపొందించిన విధానాన్ని అనుసరించి వాటిని క్రూయిజ్ క్షిపణులను, బాలిస్టిక్ క్షిపణులుగా వర్గీకరిస్తారు.
ప్రయోగ విధానాన్ని అనుసరించి క్షిపణులను పలు తరగతులుగా వర్గీకరిస్తారు.
ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే, ఉపరితలం నుంచి సముద్ర తలంపైకి ప్రయోగించే, గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే, గగనతలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే, సముద్ర తలం నుంచి సముద్ర తలంపైకి ప్రయోగించే క్షిపణులు, సముద్రతలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, ట్యాంక్ విధ్వంసక క్షిపణి.పరిధిని బట్టి క్షిపణులను నాలుగు రకాలుగా వర్గీకరించారు. స్వల్ప శ్రేణి క్షిపణులు, మధ్యశ్రేణి క్షిపణులు, దీర్ఘశ్రేణి క్షిపణులు, ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు.
ఇంధనాన్ని బట్టి క్షిపణులను ఘన ఇంధనంతో నడిచే క్షిపణులు, ద్రవ ఇంధనంతో నడిచే క్షిపణులు, హైబ్రిడ్ సాంకేతికతతో నడిచే క్షిపణులు, రాంజెట్ మిస్సైల్స్, స్క్రామ్‌జెట్ మిస్సైల్స్, క్రయోజెనిక్ మిస్సైల్స్.
వార్‌హెడ్ ఆధారంగా క్షిపణులను సంప్రదాయ, వ్యూహాత్మక క్షిపణులుగా వర్గీకరించవచ్చు.
క్రూయిజ్ మిస్సైల్స్
జెట్ ఇంజైన్ ద్వారా భూ వాతావరణ పరిధిలో తక్కువ ఎత్తులో దాదాపు క్షితిజానికి సమాంతరంగా నడిచే గైడెడ్ మిస్సైల్ ను క్రూయిజ్ క్షిపణి అంటారు. క్రూయిజ్ క్షిపణులు లక్ష్యాన్ని సమీపించేటప్పుడు నిలువుగా పైకి లేచి భూ గురుత్వాకర్షణ బలాల సహాయంతో లక్ష్యాలపై పడి వాటిని నాశనం చేస్తాయి. వేగాన్ని అనుసరించి ఈ క్షిపణులను పలు రకాలుగా వర్గీకరించారు.
సబ్‌సోనిక్ క్రూజ్ మిస్సైల్ఇవి ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తాయి. ఇవి 0.8 మాక్ వేగంతో ప్రయాణిస్తాయి. అంటే వీటి వేగం ధ్వని వేగానికి 0.8 రెట్లు ఉంటుంది. ఉదాహరణ: నిర్భయ్.
బాలిస్టిక్ క్షిపణులు
బాలిస్టిక్ క్షిపణులు క్షితిజానికి లంబంగా(నిట్టనిలువుగా) లేదా నిలువుగా రాకెట్ సహాయంతో ప్రయాణిస్తూ నిర్ణీత ఎత్తుకు చేరిన తర్వాత అవి భూమి గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో లక్ష్యాలపై పడి వాటిని ధ్వంసం చేస్తాయి. ఒక బాలిస్టిక్ క్షిపణి ప్రయాణించే దూరం ఆధారంగా దాని ప్రయోగ వేదిక నిర్ణయం అవుతుంది. భూ ఉపరితలం, సముద్ర నౌకలు, గగనతల ప్రయోగ వేదికల నుంచి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించ వచ్చు. ఉదాహరణకు ప్రస్తుతం భారత రక్షణ దళాల్లో వినియోగి స్తున్న పృథ్వీ, అగ్ని శ్రేణి క్షిపణులు, ధనుష్ బాలిస్టిక్ క్షిపణులే. ఇవి ప్రయాణ పథంలో వాటి మార్గదర్శక యంత్రాంగం ద్వారా చిన్న చిన్న సర్దుబాట్లు జరుపుకోవచ్చు.
సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్
ఈ క్షిపణి ధ్వని వేగానికి 2 నుంచి 3 రెట్ల వేగంతో ప్రయాణిస్తుంది. మరో రకంగా చెప్పాలంటే ఈ క్షిపణి సెకనులో ఒక కిలోమీటర్ దూరం ప్రయాణిస్తుంది. క్షిపణి సామర్థ్యం దాని మాడ్యులర్ డిజైన్, అది ప్రయోగించే వేదికల (యుద్ధ నౌకలు, జలాంతర్గాములు, వివిధ రకాలైన విమానాలు, మొబైల్ స్వతంత్ర లాంచర్లు)పై ఆధారపడి ఉంటుంది. క్షిపణుల సూపర్ సోనిక్ వేగం, వార్ హెడ్ బరువు వల్ల వీటికి అధిక గతిశక్తి లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా భారత్, రష్యా అభివృద్ధిపరిచిన బ్రహ్మోస్ మాత్రమే ప్రముఖ బహుముఖ సూపర్ సోనిక్ క్రూయిజ్క్షిపణి వ్యవస్థ.
హైపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్హైపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ మాక్ సంఖ్య 5 కంటే ఎక్కువ. అంటే ఈ క్షిపణులు ధ్వని వేగం కంటే ఐదు రెట్ల వేగంతో ప్రయాణిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నాయి. బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ కూడా బ్రహ్మోస్–2 హైపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని అభివృద్ధి చేసే ప్రక్రియలో ఉన్నది.