కేంద్రం స్కీం ద్వారా మిషన్ ​కాకతీయ రిపేర్లు

  •  
  • అమృత్ సరోవర్ పథకం కింద 2,685 చెరువులకు ప్రపోజల్స్
  •     2087 చెరువులు గతంలో కాకతీయ కింద డెవలప్​ చేసినవే 
  •      కొత్త గా మరో 598  చెరువుల పునరుద్ధరణ
  •     ఆగస్టు 15 లోగా పనుల పూర్తికి ప్రణాళిక

నిర్మల్, వెలుగు: మిషన్​ కాకతీయ కింద గతంలో వేల కోట్లు ఖర్చు పెట్టి పునరుద్ధరించిన చెరువులు మళ్లీ రిపేర్లకు వచ్చాయి. తాజాగా కేంద్రం తెచ్చిన ‘అమృత్ సరోవర్ స్కీం’ కింద రాష్ట్రం నుంచి 2,685 చెరువులకు ప్రపోజల్స్​ పంపించగా, అందులో మిషన్​కాకతీయ చెరువులే  ఏకంగా 2,087 ఉన్నాయి. మిగిలిన 598  చెరువులు కొత్తవి కాగా, ప్రతి జిల్లా నుంచి 75 చెరువుల చొప్పున అమృత్​ సరోవర్​ స్కీంకు ఎంపిక చేశారు. కేంద్రం తెచ్చిన ఈ స్కీం ద్వారా ఈజీఎస్​నిధులతో ఎంపిక చేసిన చెరువుల్లో పూడికతీత, కట్టల బలోపేతం, తూములు, మత్తళ్లకు రిపేర్లు లాంటి లాంటి పనులు చేస్తారు. అవకాశం ఉన్నచోట కొత్త చెరువులు కూడా నిర్మించనున్నారు.  ఇందుకోసం ప్రతి చెరువుకు లక్ష నుంచి రూ.10 లక్షల దాకా ఖర్చు చేయబోతున్నారు.

దెబ్బతిన్న మిషన్​ కాకతీయ చెరువులు 

తెలంగాణలో 46 వేల చెరువులు ఉండగా, ప్రభుత్వం 4,352 కోట్లు ఖర్చు చేసి నాలుగు విడతల్లో 22 వేల చెరువులను డెవలప్​చేసింది. చాలా చోట్ల పనుల్లో క్వాలిటీ లేక ఏడాది తిరగకముందే  కట్టలు తెగిపోవడంతో పాటు తూములు, మత్తళ్లు దెబ్బతిన్నాయి. ఎప్పట్లాగే పూడిక పేరుకపోయింది. దీంతో ఆయా చెరువులకు రిపేర్లు చేయాలని ఆయకట్టు రైతుల నుంచి వినతులు వస్తున్నాయి. ఈలోగా కేంద్రం దేశవ్యాప్తంగా చెరువుల పునరుద్ధరణ కోసం  అమృత్ సరోవర్ స్కీం తెచ్చింది. ఈ పథకం కింద ఎంపిక చేసిన చెరువులను ఈజీఎస్​ కింద  డెవలప్​చేయనున్నారు. దీంతో గ్రామీణాభివృద్ధి ఆఫీసర్లు ప్రతి జిల్లా నుంచి 75 చెరువులతో ప్రపోజల్స్​ రెడీ చేయగా ఇందులో మిషన్​కాకతీయ చెరువులు అధికంగా ఉన్నాయి. 

అమృత్ సరోవర్ స్కీం ఇదీ.. 

భూగర్భజలాలు పెంచడం ద్వారా తాగు, సాగునీటి సౌకర్యం కల్పించే లక్ష్యంతో చెరువులను డెవలప్​చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్​ స్కీం తెచ్చింది.  ఈ  పథకం కింద 32 జిల్లాల నుంచి 75కు పైగా చెరువులకు ప్రపోజల్స్​ పంపినప్పటికీ ఉన్నతాధికారులు మాత్రం ప్రతి జిల్లాకు 75 చెరువుల చొప్పున ఫైనల్​ చేస్తున్నారు.  మిషన్​కాకతీయ కింద గతంలో డెవలప్​ చేసిన 2,087 చెరువులకు రిపేర్లు చేసి,  కొత్తగా 598 చెరువులను పూర్తిస్థాయిలో డెవలప్​ చేయాలని భావిస్తున్నారు. ఈ స్కీం కింద ప్రతి చెరువుకు కనిష్ఠంగా రూ. లక్ష నుంచి గరిష్ఠంగా రూ.10 లక్షలు మొత్తంగా రూ. 268 కోట్ల వరకు వాడుకునే చాన్స్​ ఉందని ఆఫీసర్లు అంటున్నారు. నిబంధనల ప్రకారం..  ఎలాంటి యంత్రాలు వాడకుండా కేవలం ఉపాధి హామీ కూలీల ద్వారానే పనులు చేపడుతారు. రాబోయే ఆగస్టు 15లోగా  పనులన్నీ పూర్తి చేసి చెరువుల వద్ద జాతీయ జెండా ఎగరవేయాలని అధికారులు భావిస్తున్నారు.

గడువులోగా పూర్తి చేస్తాం

ఆగస్టు 15లోగా అమృత్ సరోవర్ కింద చెరువుల పునరుద్ధరణ పూర్తి చేస్తాం. ఆగస్టు 15న ఈ చెరువుల వద్ద జాతీయ జెండా ఎగురవేయాలని నిర్ణయించాం. జిల్లా వ్యాప్తంగా 75కి పైగా చెరువుల పనులను అమృత్ సరోవర్ కింద చేపడుతున్నాం. ఈజీఎస్ కూలీలతోనే కొత్తగా చెరువుల తవ్వకాలు, రిపేర్లు చేపడతాం.  ఈ  చెరువుల  కారణంగా  భూగర్భ జలాలు పెరుగుతాయి. అవసరమైన చోట్ల సాగునీరుగా వాడుకోవచ్చు. పశువులకు కూడా తాగునీటి సౌకర్యం ఏర్పడుతుంది.
– విజయలక్ష్మి, డీఆర్డీఏ పీడీ, నిర్మల్ జిల్లా