IPL 2024: మిచెల్ స్టార్క్ - ది మిలియనీర్.. ఐదు నిమిషాలలో మారిన ఐపీఎల్ రికార్డులు

 IPL 2024: మిచెల్ స్టార్క్ - ది మిలియనీర్.. ఐదు నిమిషాలలో మారిన ఐపీఎల్ రికార్డులు

మిచెల్ స్టార్క్..ప్రస్తుతం ఈ ఒక్క పేరు మార్మోగిపోతోంది. 8 ఏళ్ళ తర్వాత ఐపీఎల్ ఆడటానికి వచ్చిన ఈ స్టార్ బౌలర్ ఒక్కసారిగా ఐపీఎల్ లో చరిత్ర సృష్టించాడు. మినీ వేలంలో ఈ పేసర్ మిలియనీర్ గా మారిపోయాడు. రూ. 2 కోట్లతో బరిలోకి దిగిన స్టార్క్‌ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. గుజరాత్‌ టైటాన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య తీవ్ర పోటీ జరిగింది. చివరికి రూ. 24.75  కోట్లకు దక్కించుకుంది. దీంతో ప్యాట్‌ కమిన్స్‌ రూ. 20.5 కోట్ల రికార్డును స్టార్క్‌ అధిగమించాడు.

చివరిసారిగా 2015 ఐపీఎల్ ఆడిన స్టార్క్.. గాయం కారణంగా మధ్యలోనే టోర్నీ నుండి వైదొలిగాడు. ఆ తర్వాత ఐపీఎల్ కంటే జాతీయ జట్టే ముఖ్యమని భావించిన ఈ స్టార్క్.. 8 ఏళ్ళ పాటు ఐపీఎల్ ఆడలేదు. స్టార్క్ వస్తే ఎగబడి కొందామని ఫ్రాంచైజీలు ఉన్నా.. ఈ స్టార్ ఆటగాడు మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు. 2024 లో టీ 20 వరల్డ్ కప్ టోర్నీ జూన్ లో జరగనుండడంతో ఐపీఎల్ ను సన్నాహకంగా భావించిన ఈ స్టార్ బౌలర్ 2024 వేలానికి తన పేరునిచ్చాడు. 

వేలానికి ముందు వరకు స్టార్క్ మీద ఎన్నో అంచనాలున్నాయి. అయితే ఊహకు అందని విధంగా స్టార్క్ అందరినీ షాక్ కు గురి చేసాడు. ఏకంగా రూ. 24.75 కోట్లు పలకడంతో ఈ స్టార్ బౌలర్ ఒక్కసారిగా మిలియనీర్ అయిపోయాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటికే తనదైన ముద్ర వేసిన స్టార్క్.. ఫార్మాట్ ఏదైనా చెలరేగిపోగలడు. తన పదునైన యార్కర్లతో బ్యాటర్లను బెంబేలెత్తించగలడు. ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో అద్భుతమైన బౌలింగ్ తో ఆసీస్ కు వరల్డ్ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు.  మరి స్టార్క్ రాక కోల్ కత్తాకు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి.