T20 World Cup 2024: మిచెల్ స్టార్క్ అదరహో.. వరల్డ్ కప్‌‌లో ఆల్‌టైం రికార్డ్ బ్రేక్

T20 World Cup 2024: మిచెల్ స్టార్క్ అదరహో.. వరల్డ్ కప్‌‌లో ఆల్‌టైం రికార్డ్ బ్రేక్

ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటికే బౌలింగ్ లో తన మార్క్ చూపించాడు. ఫార్మాట్ ఏదైనా తన స్వింగ్, యార్కర్లతో దడ పుట్టిస్తాడు. ఇక వరల్డ్ కప్ వస్తే స్టార్క్ పూనకం వచ్చినట్టు చెలరేగుతాడు. 50 ఓవర్ల వరల్డ్ కప్ అయినా.. టీ20 వరల్డ్ కప్ అయినా స్టార్క్ అదరగొట్టేస్తాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లోనూ చెలరేగుతున్నాడు. ఈ క్రమంలో ఒక ఆల్ టైం రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. 

2024 వరల్డ్ కప్ సూపర్ 8 లో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ లో స్టార్క్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. మూడో బంతికే తనిజిద్ హసన్ ను క్లీన్ బౌల్డ్ చేసి వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ప్లేయర్ గా రికార్డ్ సెట్ చేశాడు. ఇప్పటివరకు వరల్డ్ కప్ (వన్డే, టీ20) చరిత్రలో స్టార్క్ 95 వికెట్లు పడగొట్టాడు. దీంతో నిన్నటివరకు శ్రీలంక పేసర్ లసిత్ మలింగ (94)తో సమంగా ఉన్న స్టార్క్.. తాజాగా ఆ రికార్డ్ బ్రేక్ చేసి అగ్రస్థానంలో నిలిచాడు.

మలింగ 59 ఇన్నింగ్స్ ల్లో 94 వికెట్లు పడగొడితే.. స్టార్క్ 52 మ్యాచ్ ల్లోనే 95 వికెట్లు తీయడం విశేషం. బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్ 75 ఇన్నింగ్స్ ల్లో 92 వికెట్లతో ఈ లిస్టులో మూడో స్థానంలో ఉన్నాడు.  వన్డేల్లో 65 వికెట్లు టీ20ల్లో 27 వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ కు ఇది 8 వ ప్రపంచ కప్ కాగా..  ఐదో టీ20 వరల్డ్ కప్. 2012 టీ20 ప్రపంచ కప్ లో అరంగేట్రం చేసిన ఈ ఆసీస్ పేసర్ ఆరు మ్యాచ్‌ల్లో 16.40 సగటుతో 10 వికెట్లు పడగొట్టాడు. 2014 లో 5 వికెట్లు.. 2021 లో 9 వికెట్లు.. 2022 లో మూడు వికెట్లు సాధించాడు.