మిర్యాలగూడ, వెలుగు: నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతమైన మిర్యాలగూడ నియోజకవర్గ లోని పల్లెలను అభివృద్ధికి కేరాఫ్‌గా మారుస్తానని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం వేములపల్లి మండలం ఆమనగల్లు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తాను నిర్వహించనున్న ‘మన ఊరు మన ఎమ్మెల్యే’ కార్యక్రమ పోస్టర్లను డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ తో పాటు స్థానిక నేతలతో ఆవిష్కరించారు.
15 మంది కల్యాణ లక్ష్మీ లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన ఊరు మన ఎమ్మెల్యే పేరిట ప్రతి ఊరిని.. సందర్శించి ప్రజలతో పాటు కార్యకర్తలను కలిసి చర్చిస్తామన్నారు. ఐక్యతను, అభివృద్ధిని విస్మరించి గ్రామాల్లో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తే సహించేది లేదన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ కోసమే పని చేయాలని చెప్పారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు సొంత నిధులతో అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలన్నింటిని అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. పార్టీలకతీతంగా పల్లెల్లో చేపట్టాల్సిన పనులను గుర్తించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. రానున్న శివరాత్రి నుంచి ఈశ్వర బంధం స్కీం ను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చిరుమర్రి కృష్ణయ్య, పొదిల శ్రీనివాస్, స్కైలాబ్ నాయక్, పగిడి రామలింగయ్య, సందీప్, కాంతారెడ్డి, రావు ఎల్లారెడ్డి, రవీందర్ రెడ్డి, ప్రవీణ్ తదితరులున్నారు.