- పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం
కోదాడ,వెలుగు: కోదాడ నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే ఐదేళ్లుగా అవినీతి, అక్రమాలతో రాజకీయాలు చేశారని, ఇప్పుడు తాను అవినీతి రహిత పాలన అందించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. సోమవారం పట్టణంలోని కాంగ్రెస్ ఆఫీస్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. కోదాడలో గంజాయి రవాణా, అమ్మకాలను నిర్మూలిస్తామన్నారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నాయకులు తమపై ఎన్నో ఆరోపణలు చేశారన్నారు.
అయినా నియోజకవర్గ ప్రజలు తనపై నమ్మకంతో ఓటేశారని, కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేపం పథకాలు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ డీసీసీబీ చైర్మన్ ముతవరపు పాండురంగారావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యెర్నేని బాబు, పీసీసీ డెలిగేట్ లక్ష్మీ నారాయణ రెడ్డి, నాయకులు వంగవీటి రామారావు, నల్లపాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.