![అరుదైన శస్త్ర చికిత్స చేసిన ఎమ్మెల్యే .. మహిళ కడుపులోని కణితి తొలగింపు](https://static.v6velugu.com/uploads/2025/02/mla-dr-vamsi-krishna-performed-rare-operation-on-woman-and-removed-tumor-in-stomach-becoming-lifesaver_ZITE62BOC0.jpg)
అచ్చంపేట, వెలుగు : గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతున్న మహిళకు అరుదైన ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న కణితిని తొలగించి ప్రాణదాత అయ్యాడు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ. చారకొండ మండలానికి చెందిన గోరేటి లక్ష్మమ్మ కొంత కాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నది. నిరుపేద అయిన లక్ష్మమ్మ ప్రైవేటు దవాఖానలో చికిత్స చేయించుకోలేకపోయింది. ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో అచ్చంపేట ఏరియా హాస్పిటల్ లో రెండోసారి నిర్వహించిన సర్జికల్ క్యాంపునకు వచ్చి ఆమె అనారోగ్య పరిస్థితిని ఎమ్మెల్యేకు విన్నవించింది. దీంతో దవాఖాన వైద్యులతో కలిసి మంగళవారం లక్ష్మమ్మకు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న కణితిని తొలగించారు.
ప్రైవేటు హాస్పిటల్కు వెళితే లక్షలు ఖర్చయ్యేవని, పైసా ఖర్చు లేకుండా కణితిని తొలగించినందుకు ఎమ్మెల్యేకు లక్ష్మమ్మ కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సీబీఎం ట్రస్ట్ చైర్ పర్సన్ డాక్టర్ అనురాధ ఆధ్వర్యంలో అచ్చంపేట ఏరియా హాస్పిటల్ లో రోగులు కూర్చునేందుకు కుర్చీలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభు, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.