రామచంద్రాపురం/పటాన్చెరు, వెలుగు: పటాన్చెరు నియోజకవర్గంలోని మత్స్యకారుల సంక్షేమానికి సంపూర్ణ సహకారం అందించడంతో పాటు, మత్స్యకారుల సొసైటీలో నూతన సభ్యత్వానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఇస్నాపూర్, రామచంద్రాపుం మత్స్యకార సంఘాలు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఇస్నాపూర్ గ్రామ పరిధిలోని వివిధ చెరువుల పరిధిలోగల మత్స్యకార సహకార సంఘంలో సభ్యత్వం ఇవ్వాలని గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గ్రామ పరిధిలోని పెద్ద చెరువు చేప పిల్లల పెంపకానికి అనువుగా లేదని సంబంధిత కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు నివేదిక ఇవ్వడం వల్ల చేప పిల్లలు పంపిణీ చేయలేదని జిల్లా మత్స్యశాఖ అధికారి నరసింహారావు చెప్పారు.
స్పందించిన ఎమ్మెల్యే చేపల పెంపకం పైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న ముదిరాజ్ సంఘం సభ్యులు ఆర్థికంగా నష్టపోతారని, పెద్ద చెరువు కాలుష్యంపై సమగ్ర నివేదిక అందించాలని పీసీబీ అధికారి గీతను ఆదేశించారు. పెద్ద చెరువుకు సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సభ్యత్వం అందించాలని అధికారులను ఆదేశించారు. పీసీబీ నివేదిక అనంతరం పెద్ద చెరువు పరిధిలోని పరిశ్రమల ద్వారా మత్స్యకారులందరికీ ప్రతి ఏటా నష్టపరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం రామచంద్రాపురం రాయసముద్రం చెరువు పరిధిలోని మత్స్యకార సహకార సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. సమావేశంలో ఇరిగేషన్ డీఈ రామస్వామి, ఇస్నాపూర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రాఘవేందర్, వైస్ ప్రెసిడెంట్ గోపాల్, సలహాదారులు పెంటయ్య, నర్సింలు, రవీందర్, రామచంద్రాపురం ముదిరాజ్ సంఘం సభ్యులు శ్రీశైలం, రాములు, వెంకట్, గాంధీ శ్రీను, పెద్ద రాజు, టెంట్ హౌస్ శ్రీను, ఉమ శ్రీను పాల్గొన్నారు.