జడ్చర్ల  నియోజకవర్గంలో ఈజీఎస్​ పనులు స్పీడప్​ చేయాలి : ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల  నియోజకవర్గంలో ఈజీఎస్​ పనులు స్పీడప్​ చేయాలి : ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల టౌన్, వెలుగు:  జడ్చర్ల  నియోజకవర్గంలో ఈజీఎస్​ పనులను స్పీడప్​ చేయాలని, ప్రతి గ్రామంలో పనులు కల్పించాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​లో ఎంపీడీవోలు, ఏపీవోలు, టెక్నికల్  అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లతో రివ్యూ మీటింగ్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెటీరియల్  కాంపొనెంట్ తో కలిపి చేసే పనుల్లో జీపీ బిల్డింగ్​లు, సీసీ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఈజీఎస్​లో నిధులకు పరిమితి ఉండదని, ఎంత వాడుకుంటే అన్ని నిధులు వచ్చే అవకాశం ఉండడంతో నియోజకవర్గానికి వీలైనన్ని ఎక్కువ నిధులు వచ్చేలా బడ్జెట్ ను రూపొందించాలని కోరారు. 40 శాతం మెటీరియల్  కాంపొనెంట్ ను ఉపయోగించుకొని నిర్మాణాత్మకమైన పనులు చేపట్టాలన్నారు. గత బీఆర్ఎస్  ప్రభుత్వం ఈజీఎస్​ నిధులను ఇతర పథకాలకు అక్రమంగా మళ్లించడంతో కూలీలకు డబ్బులు రావడానికి నాలుగైదు నెలలు పట్టేదని, దీంతో కూలీలు ఉపాధి పనులపై విముఖత చూపిస్తున్నారని చెప్పారు.

కాంగ్రెస్  అధికారంలోకి వచ్చాక కూలీ డబ్బులు సాధ్యమైనంత త్వరగా చెల్లిస్తోందని తెలిపారు. బాలానగర్ లో వైకుంఠధామాన్ని ప్రైవేట్​ వ్యక్తులు కూల్చేశారని ఫోర్ మెన్  కమిటీ స్పష్టం చేసినా, బాధ్యులపై కేసు నమోదు చేసి చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎంపీడీవోను ఆదేశించారు.