- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు, వెలుగు : గత బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం మునుగోడు మండలం కొంపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో రూ.50 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులు, వెదిర పూలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన కళావేదికను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో విద్యావ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెలిపారు. నియోజవర్గంలో మొదటి ప్రాధాన్యత విద్యకే ఇస్తానన్నారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలల్లో చదివేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.
నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తాం
నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడులోని తన క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ శ్యాంప్రసాద్ రెడ్డి తో కలిసి నియోజకవర్గంలోని నీటి వనరుల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. శివన్నగూడెం, కిష్రాంపల్లి రిజర్వాయర్లకు నీటిని తెచ్చే విషయంతోపాటు శివన్నగూడెం రిజర్వాయర్ నుంచి నారాయణపూర్ చౌటుప్పల్ మండలాలకి నీటి తరలింపుపై అధికారులతో చర్చించారు.