- ఎమ్మెల్యే కోరం కనకయ్య
కామేపల్లి, వెలుగు : నిత్యం ప్రజా సమస్యల ఏజెండానే ధ్యేయంగా పని చేసే కాంగ్రెస్ నేత రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి రాష్ట్ర అగ్రికల్చర్ కమిషన్ కు వన్నె తేవాలని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య కోరారు. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి గోపాల్ రెడ్డిని ఇటీవల తెలంగాణ రాష్ట్ర అగ్రికల్చర్ రైతు కమిషన్ సభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆదివారం ఆయన స్వగ్రామైన కామేపల్లి మండలంలోని పాతలింగాల గ్రామానికి వస్తుండగా భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎదురెళ్లి కొత్త లింగాల కోట మైసమ్మ తల్లి గుడి వద్ద ఘన స్వాగతం పలికారు.
అనంతరం గోపాల్ రెడ్డి కోట మైసమ్మ దేవాలయంలో మొక్కులు చెల్లించుకొని కొత్తలింగాల లోని మాజీ మంత్రి రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసిన ర్యాలీగా పాత లింగాల చేరుకున్నారు. అనంతరం జరిగిన సన్మాన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గోపాల్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం సంచిత స్థానం కల్పించడం శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు రామ్ రెడ్డి చరణ్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గింజల నరసింహారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ మల్లిబాబు యాదవ్ తదితరులు ఉన్నారు.