
దుబ్బాక, వెలుగు: బీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే సభకు దుబ్బాక నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం క్యాంపు ఆఫీసులో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. త్వరలో మరో సమావేశాన్ని నిర్వహించి పార్టీ శ్రేణులను తరలించే విషయాన్ని చర్చిస్తానని, దీనికి సంబంధించిన తేదీని ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తానని చెప్పారు. దుబ్బాక నుంచి కనీసం పాతిక వేల మందికి తక్కువ కాకుండా వరంగల్ సభకు వెళ్లాలని సూచించాచారు. కార్యక్రమంలో పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
స్వగ్రామంలో ఎమ్మెల్యేకు సన్మానం
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిని స్వగ్రామమైన పొతారం ప్రజలు సన్మానించారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి పోతారం గ్రామంలోని పెద్ద చెరువులోకి గోదావరి నీళ్లు రావడంతో గ్రామ ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గతేడాది శ్రీరామనవమి రోజున గ్రామానికి గోదావరి నీళ్లు రావాలని ప్రార్థిస్తే మళ్లీ ఇదే రోజు చెరువులోకి నీళ్లు చేరడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్బంగా చెరువు వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు.