
కల్లూరు, వెలుగు: బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ వేసిన ఛార్జిషీట్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌చేశారు. గురువారం కల్లూరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ చర్యలు ప్రతిఒక్కరూ ఖండించాలన్నారు. నల్ల జెండాలతో ప్రధాన రహదారి వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం120 మంది లబ్ధిదారులకు 1.20 కోట్ల విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
ఆఖరి గింజ వరకు కొంటాం
వరి ధాన్యం ఆఖరి గింజ వరకు కొంటామని, రైతులు ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. గురువారం కల్లూరు మండలం పుల్లయ్య బంజర్ కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యాన్ని పరిశీలించారు. రోజుకు 8 లారీల ధాన్యం కొనుగోలు చేసి, మిల్లులకు తరలించనున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని, నమ్మద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్, రాష్ట్ర నాయకుడు మట్టా దయానంద్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజాదేవి, జిల్లా నాయకులు పసుమర్తి చందర్రావు, ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వీరభద్రం తదితరులున్నారు.