ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కంటతడి.. కూతురుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారంటూ..

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కంటతడి.. కూతురుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారంటూ..

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కంటతడి పెట్టారు. ముత్తిరెడ్డిని ఆయన కూతురు తుల్జా భవాని రెడ్డి నిలదీయడంతో భావోద్వేగానికి లోనై ఏడ్చారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డిని ఆయన కూతురు  తుల్జా భవాని రెడ్డి నిలదీసిన తీరును చూసి అక్కడున్న స్థానికులు  అధికారులు,  ప్రజాప్రతినిధులు విస్తుపోయారు. 

 
ఏమైందంటే..

జనగామ జిల్లా వడ్లకొండ గ్రామంలో  హరితోత్సవాన్ని  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కూతురు తుల్జా భవాని రెడ్డి చెడా మడా తిట్టేసింది.  చేర్యాలలోని తనకు తెలియకుండా తన పేరు మీద ల్యాండ్ ఎందుకు కొన్నావని తండ్రి ముత్తిరెడ్డిని ప్రశ్నించింది.  తన సంతకం ఫోర్జరీ చేసి తన పేరును భూమి కొని రిజిస్టేషన్ చేశారని  పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. 

ఎమ్మెల్యే కంటతడి..

ప్రజలు, అధికారులు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలోనే కూతురు తుల్జా భవానిరెడ్డి తనను నిలదీయడంపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఒక్కసారిగా కంటతడి పెట్టారు. తన రాజకీయ ప్రత్యర్థులు  తన కూతురిని పావుగా చేసుకుని ఉసిగొలుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రత్యర్ధులు తనను  ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవాలి తప్ప..  కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయద్దన్నారు. 

 
గతంలోనూ అవమానాలు..

తనకు గతంలో ఇంతకన్నా ఘోరమైన అవమానాలు ఎదురుయ్యాయని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. జనగామలో చెరువు భూమిని కబ్జా చేశానంటూ కలెక్టర్ నింద మోపారని..కానీ ఆ ఆరోపణ నిజం కాలేదన్నారు. తనపై అనేక ఆరోపణలతో టికెట్ రాకుండా చేశారని..అయితే ప్రజలు తనను మళ్లీ గెలిపించి కేసీఆర్ చేతుల్లో పెట్టారని గుర్తు చేశారు. చేతగాని దద్దమ్మలు తనపై అల్లుడు, కూతురుని తనపై ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు.


ఆస్తి ఇస్తే తప్పెలా అవుతుంది..

నాకు తెలియకుండా చేర్యాలలో ల్యాండ్ ఎందుకు కొన్నావని తన కూతురు అంటోందని...ఆస్తులు గుంజుకుంటే లేదా అమ్ముకుంటే తప్పు అవుతుంది కానీ..ఆస్తి ఇస్తే ఎలా తప్పు అవుతుందని ముత్తిరెడ్డి ప్రశ్నించారు.  చేర్యాలలో 1200 గజాలు, జనగామలో 1100 గజాలు కొనిచ్చారని కూతురు తుల్జా భవానీ అంటోందని...తన కూతురికి తాను సంపాదించి ఇచ్చిన ఆస్తి ఇస్తే ఎలా మోసం అవుతుందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా..ప్రజాసేవ చేయడంలో మాత్రం వెనకడుగు వేయనన్నారు. జనగామలోనే చివరి శ్వాస వరకు ఉంటానని..నియోజకవర్గంలోని 376 చెరువుల్లో తన చితాభస్మం కలుస్తుందన్నారు.