అశ్వారావుపేట, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేసిన నాయకుడు తుమ్మల నాగేశ్వర్రావును కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నామని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య అన్నారు. సోమవారం అశ్వారావుపేట టౌన్ లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టులను వాడుకొని వదిలేసిన ఘనుడు కేసీఆర్ అని విమర్శించారు.
తమ పార్టీలో సర్వేల ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పోడు హక్కు పత్రాల విషయంలో కేసీఆర్ నామమాత్రంగానే సర్వేలు చేయించి చేతులు దులుపుకున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పోడు వ్యవసాయం చేస్తున్న ప్రతి ఒక్కరికీ హక్కు పత్రాలు ఇస్తుందన్నారు. ములకలపల్లి జడ్పీటీసీ సున్నం నాగమణి, స్థానిక నాయకులు తుమ్మ రాంబాబు, ప్రసాద్, సత్యనారాయణ చౌదరి, వేముల ప్రతాప్ పాల్గొన్నారు