నల్లగొండ: 2014లో ముఖ్యమంత్రి హోదాలో ఎస్ఎల్ బీసీ ప్రాజెక్టును కూర్చి వేసుకుని పూర్తి చేస్తానని.. ఆ తర్వాత శివన్నగూడెం ప్రాజెక్టును పూర్తి చేస్తానని కేసీఆర్ చెప్పారని.. కానీ, జగన్ తో కుమ్మక్కై నీళ్లను ఆంధ్రాకు తరలించేందుకు సహకరించారని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 11వ తేదీ ఆదివారం చండూరులో రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు సంతకం చేశారని.. ఇప్పుడు కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు ఇంతకంటే ద్రోహం మరొకటి ఉంటుందా అని ఆవేదన వ్యక్తం చేశారు.
దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చి.. ఇప్పుడు మళ్లీ సెంటుమెంట్ రెచ్చగొట్టేందుకు కేసీఆర్.. నల్గొండలో సభ పెడతానంటున్నారని.. కెసిఆర్ బహిరంగ సభను పార్టీలకతీతంగా బహిష్కరించాలని కోరారు. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పది సంవత్సరాల తర్వాత ఏ మొహం పెట్టుకొని కేసీఆర్ నల్గొండకు వస్తున్నాడో సమాధానం చెప్పాలన్నారు రాజగోపాల్ రెడ్డి. ఇప్పటివరకు ఆయా ప్రాజెక్టుల కింద ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, భూ నిర్వాసితులకు న్యాయం జరగలేదని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుండి దిండి ఎత్తిపోతల పథకానికి ఎక్కడి నుండి నీళ్లు తీసుకురావాలనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదన అన్నారు.
నార్లాపూర్ నుండి తీసుకొస్తారా.. వట్టెం నుండి తీసుకొస్తారా.. ఇంతవరకు డిసైడ్ చేయలేదని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. కేవలం కాంట్రాక్టర్ల కోసం టెండర్లను పిలిచి రైతులను భూ నిర్వాసితులను, పేదవాళ్లను ఆగం చేసి రిజర్వాయర్లను కట్టాడని ఆరోపించారు. రిజర్వాయర్లకు నీరు రావాలంటే ఇప్పటివరకు కాలువలు తవ్వలేదని విమర్శించారు.హెడ్ వర్క్స్ టెండర్లు పిలవకుండానే రిజర్వాయర్లు కట్టి వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి.. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన చరిత్ర కేసీఆర్ ది నిప్పులు చెరిగారు. మీరు ఆగం చేసిన రాష్ట్రాన్ని.. ఇప్పుడు మేము గాడిలో పెడుతున్నామన్నారాయన. నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసింది టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిలని... అటువంటి వ్యక్తులు నల్గొండ ప్రజలపై కపట ప్రేమ చూపిస్తామని సభ పెడుతున్నారని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫైర్ అయ్యారు.