నల్లగొండ : టిఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామాల్లో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయని..బెల్ట్ షాపుల కారణంగా ఎంతోమంది యువకులు మద్యానికి బానిసగా మారి చనిపోయారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. డిసెంబర్ 25వ తేదీ సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మునుగోడు మండలంలోని 26 గ్రామాల ముఖ్య నాయకులతో బెల్ట్ షాపులు మూసివేత, గ్రామాల అభివృద్ధిపై మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బెల్ట్ షాపుల విషయంలో చాలా సీరియస్ గా ఉంటానని.. తాగుడు వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయని అన్నారు. మద్యపానానికి తాను వ్యతిరేకం కాదు.. కానీ ఎక్కడబడితే అక్కడ దొరకడం వల్ల యువత చెడిపోతుందన్నారు. చట్ట ప్రకారం బెల్ట్ షాపులు అమ్మడానికి వీలులేదన్నారు. గ్రామాలలో నాయకులు అందరూ బెల్టు షాపు లేకుండా చేయాలని.. బెల్ట్ షాపులను బంద్ చేయించాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని చెప్పారు.
ఈ అంశం రాజకీయాలతో సంబంధం లేదని.. మళ్లీ చెప్తున్నా తన పదవి పోయిన పర్వాలేదు.. బెల్ట్ షాపులు మాత్రం మూసివేయాల్సిందేనని.. ఈ విషయంలో రాజీ పడేదిలేదని ఆయన స్పష్టం చేశారు.బెల్ట్ షాపులు మూసివేయడం అనేది గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతని... బెల్ట్ షాపులు మూసివేసే ప్రయత్నంలో తనతోపాటు నడిచిన వాళ్లకే ప్రాముఖ్యత ఉంటుందని అన్నారు రాజగోపాల్ రెడ్డి.
2014 ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామాలలో బెల్ట్ షాపులు లేవని.. టిఆర్ఎస్ ప్రభుత్వంలో బెల్ట్ షాపులు తీసుకొచ్చి ఎంతోమంది యువకుల ప్రాణాలు పోవడానికి కారణమైందని విమర్శించారు. బెల్ట్ షాపు ఉద్యమం మునుగోడు నుంచే మొదలవ్వాలి .. అయిందన్నారు. ఒక ఉద్యమం లాగా ఇది రావాలని చెప్పారు. బెల్ట్ షాపులు మూసివేయాలని ప్రతి గ్రామంలో దండోరా వేయించండని, ప్రతి గ్రామంలో 10మందితో ఒక కమిటీ వేయాలని.. అందులో నలుగురు మహిళలు ఉండేలా చూడాలని రాజగోపాల్ రెడ్డి సూచించారు.