హైదరాబాద్, వెలుగు: పరిగి నియోజకవర్గంలోని శివారెడ్డిపల్లిలో రూ. వెయ్యి కోట్లు రుణమాఫీ అయ్యిందని, బీఆర్ఎస్ హయాంలో ఈ గ్రామంలో ఎంత రుణమాఫీ అయిందో చర్చకు సిద్ధమా అని కేటీఆర్ కు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. సోమవారం ఆయన గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం శివారెడ్డిపల్లిలో రూ.కోటి 66 లక్షలు రుణమాఫీ చేసిందని, బీఆర్ఎస్ చేసిన చారాణా రుణమాఫీ వడ్డీకి కూడా సరిపోలేదని ఎద్దేవా చేశారు. వికారాబాద్ లో ఒక్క రైతుకైనా రుణమాఫీ చేశారా? అని బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ పేరుతో పరిగి వచ్చిన కేటీఆర్.. రేవంత్ రెడ్డిని లాటరీ సీఎం అని కామెంట్ చేయడం సరికాదన్నారు.
అమెరికాలో ఉండి లాటరీతో మంత్రి అయ్యింది కేటీఆర్ అని, ఆయన బావ, చెల్లెలు కవిత లాటరీ బ్యాచ్ అని మండిపడ్డారు. పార్ములా ఈ కార్ రేసులో ఒక వైపు ఏసీబీ, మరోవైపు ఈడీ విచారణ జరుగుతుందని, కవిత లిక్కర్ కుంభకోణంలో జైలుకు పోయి బయటకు వచ్చిందని తెలిపారు. కేసీఆర్ కాళేశ్వరం కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్నారని, ఫోన్ టాపింగ్ విషయంలో హరీశ్ రావుపై ఆరోపణలు ఉన్నాయని రామ్మోహన్ రెడ్డి విమర్శించారు.