ఎమ్మెల్యే కుట్రను అడ్డుకుంటాం ..జాతీయ ప్రధాన కార్యదర్శి నిఖిల్​ ఆనంద్​

దేవరకొండ, వెలుగు : దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్​ కళాశాల ఆవరణలో ఇంటిగ్రేటెడ్​ వెజ్, నాన్​ వెజ్​మార్కెట్​ను ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే రవీంద్రకుమార్​ చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామని బీజేపీ ఓబీసీ జాతీయ ప్రధాన కాయదర్శి నిఖిల్ ఆనంద్ ​చెప్పారు. మార్కెట్​ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాలేజీ ఎదుట ఏబీవీపీ నాయకులు చేస్తున్న దీక్షకు శుక్రవారంతో నాలుగో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడారు. 

పేద విద్యార్థుల కోసం దాతలు కాలేజీ ఏర్పాటుకు స్థలం దానం చేశారని చెప్పారు. ఆ  స్థలాన్ని ఇప్పుడు అధికార పార్టీ నాయకులు మార్కెట్​పేరుతో స్వాహా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎట్టిపరిస్థితుల్లో వారి కుట్రలను అడ్డుకుంటామని చెప్పారు.  కార్యక్రయమంలో బీజేపీ నాయకులు కేతావత్​ లాలూనాయక్, కళ్యాణ్​నాయక్, చెనమోని రాములు, అంకూరి నర్సింహ, ఏటీ కృష్ణ, వినోద్​రాథోడ్, మల్లేశ్​నాయక్, పగిళ్ల సాగర్​ పాల్గొన్నారు.