
- మహిళా కార్పొరేటర్ పై ‘హనీమూన్’ వ్యాఖ్యలే కారణం
- కంటతడి పెట్టిన కార్పొరేటర్ బానోతు సుజాత.. ఎల్బీనగర్పోలీసులకు ఫిర్యాదు
ఎల్బీనగర్, వెలుగు: ఎల్బీనగర్ బీఆర్ఎస్ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ చేసిన ఫిర్యాదుతో ఎల్బీనగర్ పోలీసులు మంగళవారం కేసు ఫైల్‌చేశారు. ఈ నెల 12న మన్సూరాబాద్ డివిజన్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అవే పనులకు మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి సోమవారం మరోసారి శంకుస్థాపన చేస్తుండగా, స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించారు. తర్వాత అదే డివిజన్లో మరోచోట శంకుస్థాపన చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించగా బీఆర్ఎస్లీడర్జక్కిడి రఘువీర్‌రెడ్డి, కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. వారిని విడిపించేందుకు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి స్టేషన్‌కు వెళ్లారు. తర్వాత ఎల్బీనగర్ డీసీపీ ఆఫీసుకు వెళ్లారు. అక్కడి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత మధుయాష్కీగౌడ్ పై విరుచుకుపడ్డారు.
బీఆర్‌ఎస్‌నేతలపై దాడి వెనుక ఆయనే ఉన్నారని ఆరోపించారు. బీజేపీ కార్పొరేటర్లు కొప్పుల నర్సింహారెడ్డి, వంగ మధుసూదన్మధ్య హనీమూన్నడుస్తోందని విమర్శించారు. హస్తినాపురం కార్పొరేటర్‌తోనూ హనీమూన్నడుస్తోందని కామెంట్చేశారు. అవి కాస్త వివాదాస్పదమయ్యాయి. హస్తినాపురం కాంగ్రెస్ కార్పొరేటర్ సుజాత నాయక్ కంటతడిపెడుతూ డీసీపీ, ఏసీపీ, సీఐకు ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు ఫైల్చేయాలని కోరారు. ఆమె ఫిర్యాదుతో ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
సుజాతకు సారీ చెప్పాలి: మధుయాష్కీ
మన్సూరాబాద్ కార్పొరేటర్ సుజాత నాయక్ కాళ్లు పట్టుకొని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సారీ చెప్పాలని కాంగ్రెస్ నేత మధుయాష్కీ డిమాండ్ చేశారు. సారీ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం అమెరికా నుంచి ప్రెస్నోట్విడుదల చేశారు. కేటీఆర్ స్పందించి సుధీర్ రెడ్డిని ఎమ్మెల్యేగా బర్తరఫ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ తరపున సుజాత కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.