
- కార్పొరేటర్‌పై ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
ఎల్బీనగర్, వెలుగు: ఎల్బీనగర్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రొటోకాల్రగడ మొదలైంది. ఈ నెల 12న మన్సూరాబాద్ డివిజన్ లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అవే పనులకు పనులకు మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి సోమవారం శంకుస్థాపన చేయడంతో వివాదం తలెత్తింది. ఎమ్మెల్యే చేసిన తర్వాత మరోసారి ఎలా శంకుస్థాపన చేస్తావని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. కొద్దిసేపటి తర్వాత అదే డివిజన్లో మరోచోట శంకుస్థాపన చేసేందుకు ప్రయత్నించగా బీఆర్ఎస్ నాయకుడు జక్కిడి రఘువీర్ రెడ్డి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అరెస్టు చేసి అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అరెస్ట్ సమయంలో రఘువీర్ రెడ్డితో పాటు కొంతమంది కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పీఎస్‌కు వెళ్లి బీఆర్ఎస్ నేతలను పరామర్శించారు. వారిని తీసుకుని డీసీపీ ఆఫీసుకు వెళ్లారు. పోలీసుల తీరును వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడుల వెనుక కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ ఉన్నారని ఆరోపించారు. బీజేపీ కార్పొరేటర్లు కొప్పుల నర్సింహారెడ్డి, వంగ మధుసూదన్ రెడ్డి మధ్య హనీమూన్ నడుస్తుందన్నారు.
అంతటితో ఆగకుండా హస్తినాపురం కార్పొరేటర్‌తో కూడా హనీమూన్ నడుస్తుందన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను కాంగ్రెస్ కార్పొరేటర్ సుజాత నాయక్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఎల్బీ నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్ నేత దర్పల్లి రాజశేఖర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇలా మాట్లాడడం సిగ్గుచేటు అన్నారు. మహిళ నాయకురాలిపై ఇలాంటి కామెంట్లు దుర్మార్గమన్నారు. వెంటనే సారీ చెప్పాలని డిమాండ్‌చేశారు. అలాగే ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తూ నియోజకవర్గంలో గొడవలు సృష్టిస్తున్నారని బీజేపీ కార్పొరేటర్లు కొప్పుల నర్సింహా రెడ్డి, వంగమధుసూదన్ రెడ్డి ఆరోపించారు. ప్రజాసామ్యబద్ధంగా శంకుస్థాపనలు చేస్తుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు రౌడీల్లా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.