- కేంద్ర బడ్జెట్లో పదేండ్లుగా తెలంగాణకు అన్యాయమే
హైదరాబాద్, వెలుగు: విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కేంద్ర సర్కారును చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఏపీతోపాటు తెలంగాణకూ నిధులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రం నుంచి కట్టిన పన్నుల ఆధారంగా యూపీ మాదిరిగా తెలంగాణకు కేంద్రం నిధులిస్తే.. సుమారు లక్ష కోట్ల దాకా రానున్నాయని వెల్లడించారు. అసెంబ్లీలో కేంద్ర బడ్జెట్ పై చర్చ సందర్భంగా వివేక్ మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ లో పదేండ్ల నుంచి తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని చెప్పారు. అయితే, గత పదేండ్లలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ దీనిపై ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదని కేటీఆర్‌ను ప్రశ్నించారు. నోట్ల రద్దుకు బీఆర్ఎస్ సపోర్టు చేసినా.. నిధులు రాలేదని అన్నారు. పార్లమెంట్ లో తెలంగాణ కోసం తాము కొట్లాడామని గుర్తుచేశారు.
రామగుండం ఫర్టిలైజర్ తెరిపించేందుకు కృషి చేశారామగుండం ఫర్టిలైజర్ గురించి బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి మాట్లాడారని, అప్పట్లో రూ.పదివేల కోట్లను మాఫీ చేయించి, దాన్ని తెరిపించేందుకు తాను కృషి చేసినట్టు వివేక్ వెల్లడించారు. తెలంగాణ నుంచి కేంద్రానికి ఒక రూపాయి ట్యాక్స్ పోతే.. దీంట్లో 27 పైసలు మాత్రమే మనకు తిరిగి వస్తున్నదని అన్నారు. అదే యూపీ, బీజేపీ పాలిత రాష్ట్రాలకు రెట్టింపు నిధులు ఇస్తున్నారని తెలిపారు. కేంద్ర బడ్జెట్ మొత్తం పీఎం పదవి కోసమే కేటాయించినట్టు కనిపిస్తున్నదని తెలిపారు. ఈ బడ్జెట్ లో బిహార్‌కు రూ.56 వేల కోట్లు, ఏపీకి రూ.60 వేల కోట్లు ఇచ్చారని, మనం కూడా కొట్లాడి నిధులు తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.
కేంద్రం నిధులు వస్తే పేద ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేయొచ్చని చెప్పారు. కృష్ణా నది నీళ్ల వాటాను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులిచ్చినప్పుడు.. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకూ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ నిధుల రిలీజ్ కోసం కొట్లాడి, ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉందన్నారు. ఇన్ కం ట్యాక్స్ మినహాయింపు కావాలని సింగరేణి కార్మికులు చాలారోజుల నుంచి కోరుతున్నారని, బీజేపీ నేతలు, కిషన్ రెడ్డి వారికి దీనిపై హామీ ఇచ్చారని వివేక్ గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇచ్చేలా చొరవ చూపాలని కోరారు.