ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి : వివేక్ వెంకటస్వామి

ఎస్సీ రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి : వివేక్ వెంకటస్వామి
  • జనాభా ప్రాతిపదికన బడ్జెట్‌‌లో నిధులు కేటాయించాలి: వివేక్ వెంకటస్వామి  
  • నామినేటెడ్ పోస్టుల్లోనూ 15 శాతం ఇవ్వాలి  
  • మాలలపై తప్పుడు ప్రచారం చేస్తున్నరు  
  • మాలల కంటే మాదిగలకే ఎక్కువ జాబ్స్ వచ్చాయని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్లను 18 శాతానికి పెంచా లని ప్రభుత్వానికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి విజ్ఞప్తి చేశారు. తమిళనాడు, హర్యానా, పంజాబ్‌‌లో రిజర్వేషన్లు పెంచిన తర్వాతే వర్గీకరణ చేశారని తెలిపారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ సమయంలో ఇదే విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా వివేక్ మాట్లాడారు. 1970లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ ‘గరీబీ హఠావో’ కార్యక్రమాన్ని చేపట్టారని, ఆ తర్వాత ఎస్సీల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు ప్రారంభించారని గుర్తుచేశారు. 

ఎస్సీ వర్గీకరణ విషయంలో మాలలపై తప్పుడు ప్రచారం జరుగుతున్నది. ఇన్ని రోజులు మాలలకే ఎక్కువగా లబ్ధి జరిగిందని ప్రచారం చేస్తున్నారు. కానీ, నిజానికి మాదిగలకే ఎక్కువగా లబ్ధి జరిగింది. ఎస్సీలకు సంబంధించి 2016 నుంచి 2024 వరకు డేటాసేకరించాను. ఆ డేటా ప్రకారం.. మాలల్లో 48,388 మందికి జాబ్స్ వస్తే, మాదిగల్లో 66,522 మందికి జాబ్స్ వచ్చాయి. డబుల్ బెడ్రూం ఇండ్లు మాదిగల్లో 64,351 మందికి వస్తే, మాలల్లో 41,439  మందికి వచ్చాయి. కార్పొరేషన్ల ద్వారా 10,726 మంది మాదిగలకు లోన్లు రాగా.. 3,759 మంది మాలలకు వచ్చాయి” అని వివరించారు. మాలలు ఎక్కువ ఉద్యోగాలు పొందారని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. 

సీఎం చెప్పినా.. సెక్రటరీ రిపోర్టు ఇవ్వలేదు..  

షమీమ్ అక్తర్ రిపోర్టు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరామని, ఆయన చెప్పినా కూడా ఎస్సీ సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీధర్ ఇవ్వలేదని ఎమ్మెల్యే వివేక్  అసెంబ్లీలో చెప్పారు. శ్రీధర్‌‌‌‌కు ఫోన్ చేసినా స్పందించలేదని, ఆయన రిపోర్టు ఎందుకు ఇవ్వలేదో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటికైనా రిపోర్టు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

‘‘ఎంపిరికల్ డేటా సేకరించామని సీఎం చెప్పారు. అయితే, వాటిపై కొన్ని అపోహలు ఉన్నాయి. రిపోర్టు ఇస్తే ఎలా సేకరించారో తెలుసుకునే చాన్స్ ఉంది” అని అన్నారు. కాగా, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు మంత్రి దామోదర రాజనర్సింహ వెంటనే స్పందించారు. ఈ రిపోర్టును ఎల్పీ నేతలకు మాత్రమే అందించామని తెలిపారు. ఇప్పుడు ప్రతి సభ్యుడికి ఇస్తామని చెప్పారు.

కాంట్రాక్టుల్లోనూ ఎస్సీలకు ప్రాధాన్యమివ్వాలి.. 

జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు బడ్జెట్‌‌లో 18శాతం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని వివేక్ కోరారు. లిడ్ క్యాప్ కార్పొరేషన్, మాల కార్పొరేషన్, నేతకాని కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. తగినన్ని నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘ఎస్సీల కోసం ప్రత్యేకంగా వందకోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలి. 

రూ.10 కోట్ల లోపు కాంట్రాక్టుల్లో 18 నుంచి 20 శాతం ఎస్సీ కాంట్రాక్టర్లకు ఇవ్వాలి. నామినేటెడ్ పోస్టు ల్లోనూ 15 శాతం ఇవ్వాలి” అని కోరారు. కేంద్రంలోనూ 14 లక్షల పబ్లిక్ సెక్టార్ జాబ్స్ ఉన్నాయని, అక్కడ కూడా సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేలా చూడాలన్నారు. ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చారని, దానికి  అనుగుణంగానే సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిందని తెలిపారు.