ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి బిగ్‌షాక్‌.. అనర్హత వేటు వేసిన మండలి చైర్మన్

ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై అనర్హత వేటు పడింది. ఇటీవల జంగా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అయితే, ఆయనపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి చైర్మన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. జంగా పార్టీ ఫిరాయింపు కారణంగా.. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని వైసీపీ కోరింది. ఈ మేరకు వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కు ఫిర్యాదు చేశారు. 

వైసీపీ నేతల ఫిర్యాదుపై శాసన మండలి చైర్మన్ మోషేనురాజు జంగా నుంచి పలు సార్లు వివరణ తీసుకున్నారు. జంగా ఇచ్చిన వివరణ ఆధారంగా ఎమ్మెల్సీగా కృష్ణమూర్తి అనర్హుడని పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. జంగా కృష్ణమూర్తి 2009 నుంచి 2019 మధ్య కాలంలో పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తరువాత ఆయన్ని వైసీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసింది. వైసీపీలో ఉన్న సమయంలో విప్ గానూ జంగా పనిచేశారు. అయితే, ఎన్నికల ముందు ఏప్రిల్ 1న ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఏప్రిల్ 6న పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు.

ఇది కేవలం కక్షసాధింపు చర్య ..

మండలి చైర్మన్ నిర్ణయంపై జంగా కృష్ణ మూర్తి స్పందించారు. శాసనమండలి ఛైర్మన్ నా ఎమ్మెల్సీ పదవికి డిస్ క్వాలిఫికేషన్ ప్రకటించారు. ఇది కేవలం కక్ష సాధింపు చర్య అనుకుంటున్నాను. గతంలో పార్టీ పెట్టని సమయంలోనే జగన్ మోహన్ రెడ్డి కి మద్దతు ఇచ్చాను. బీసీ వర్గాలకోసం నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఈరోజు డిస్ క్వాలిఫికేషన్ చేయటమంటే బీసీ వర్గాలను అవమానించేందుకే. ఎప్పుడూ లేనివిధంగా బీసీల సీట్లులో మార్పులు చేశారు. వైసీపీ నేతలు  ఛైర్మన్ పై ఒత్తిడి తెచ్చి నాపై వేటు వేయించారంటూ .. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి పై  రెండేళ్ల నుంచి ఎందుకు చర్యలు తీసుకోలేదని జంగా కృష్ణమూర్తి ప్రశ్నించారు.  ఈ విషయంలో  న్యాయ సలహాలు తీసుకుని తదుపరి కార్యాచరణ చేపడుతానని కృష్ణమూర్తి చెప్పారు.