హైడ్రా ఎఫెక్ట్.. సీఎం రేవంత్‎కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని చెరువులు, కుంటల రక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రా లాంటి వ్యవస్థను జిల్లాలు, పట్టణాల్లో కూడా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ కోరారు. జిల్లాల్లో, పట్టణాల్లో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో కబ్జాలు చేసి ఎన్నో నిర్మాణాలు చేశారని, చెరువులు, కుంటల్లో మట్టి పోసి నింపారని, దీంతో నీటి నిల్వలు, గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ తగ్గిందని చెప్పారు. దీంతో చెరువుల్లోని అక్రమణ నిర్మాణాలు కూల్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఆదివారం ఈ అంశంపై సీఎం రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు. చెరువులు కబ్జా కావడంతో మత్స్యకారులు కూడా ఆందోళనకు గరవుతున్నారని తెలిపారు. జిల్లా స్థాయిలో చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు గుర్తించే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించాలని కోరారు. హుస్సేన్ సాగర్ బఫర్ జోన్‌లో అనుమతులు లేకుండా ఎన్నో నిర్మాణాలు చేపట్టారని లేఖలో పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఒత్తిళ్లకు తలొగ్గకుండా కూల్చివేతలు చేపట్టాలని కోరారు.