
- అబద్ధాలు కొనసాగిస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, వెలుగు: అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేసేందుకు తిప్పలు పడుతున్నారని, అయినా అవన్నీ పటాపంచలు అవుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కాంగ్రెస్ సర్కారు చేస్తున్నది దుష్ప్రచారమేనని పార్లమెంట్ సాక్షిగా బయటపడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.4.42 లక్షల కోట్లేనని పార్లమెంట్లో కేంద్రం ప్రకటించినట్లు గుర్తుచేశారు. కానీ, సీఎం రేవంత్ రెడ్డి దానిని రెండింతలు చేసి రూ.8 లక్షల కోట్లుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
శుక్రవారం శాసనమండలి మీడియా పాయింట్లో పార్టీ ఎమ్మెల్సీలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పటికైనా నిజాలు చెప్పాలన్నారు. అబద్ధాలను కొనసాగిస్తే ప్రజలే ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీలు కూలిపోతున్నాయన్నదానిలో వాస్తవం లేదని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీలో చెప్పారని గుర్తుచేశారు. అసెంబ్లీ సాక్షిగా మహిళలపై సీఎం రేవంత్పరుష పదజాలంతో మాట్లాడారని మండిపడ్డారు. కాగా.. అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతీరావు పూలే విగ్రహం ఏర్పాటు చేసేందుకు సహకరించాలని మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్‌ను కవిత కోరారు. ఏప్రిల్ 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వద్ద బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.