
- యూటీఎఫ్ మీటింగ్లో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఆదివారం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం ఆ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ చావ రవి అధ్యక్షతన జరిగింది. దీనికి చీఫ్ గెస్టుగా హాజరైన నర్సిరెడ్డి మాట్లాడారు. గత పీఆర్సీ గడువు ముగిసి 20 నెలలైందని.. అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో పీఆర్సీని మెరుగైన ఫిట్ మెంట్తో అమలు చేస్తామని హామీ ఇచ్చినా.. ఇప్పటికీ అమలు కాలేదన్నారు.
ప్రతి నెలా ఫస్ట్ కు జీతాలిస్తున్నా.. జీపీఎఫ్, సరెండర్ లీవులు, మెడికల్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏండ్ల తరబడి పెండింగ్లో పెడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు పోరాటాలకు సిద్ధం కావాలని టీచర్లకు పిలుపునిచ్చారు. సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ నేతలు వెంకట్, కె.జంగయ్య, దుర్గాభవాని, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.