
- ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్
నల్గొండ అర్బన్, వెలుగు : కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్సీ, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణకు శాసనసభ ఆమోదం తెలపడంతో హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం నల్గొండలోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి గడియారం చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు. పెద్ద ఎత్తున పటాకులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు.
ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. 'మేం ఎంతో.. మాకు అంత' అనే విధంగా బీసీలకు రాష్ట్రంలో 42 శాతం రిజర్వేషన్ అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. దేశంలో మొట్టమొదటిసారి ఎస్సీ వర్గీకరణకు శాసనసభలో ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రమేశ్, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు స్వామి, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు వెంకన్న గౌడ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఫొటోలకు క్షీరాభిషేకం
దేవరకొండ, కొండమల్లేపల్లి, వెలుగు : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించడం చారిత్రాత్మకమని నల్గొండ జిల్లా పార్లమెంట్ కో–ఆర్డినేటర్ ఎంఎ సిరాజ్ ఖాన్ అన్నారు. బుధవారం అన్ని మండల కేంద్రాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, ఎమ్మెల్యే బాలూనాయక్ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.