
- మహిళా టీచర్లకు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి హామీ
హైదరాబాద్, వెలుగు: మహిళా టీచర్లకు ఇచ్చే చైల్డ్ కేర్ లీవ్‌ను ఫ్యామిలీ కేర్ లీవ్‌గా మార్పు చేయిస్తానని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి అన్నారు. మహిళా టీచర్లకు 18 ఏండ్ల వయసున్న పిల్లల వరకు ఇచ్చే చైల్డ్ కేర్ లీవ్‌ను సర్వీస్ మొత్తంలో ఎప్పుడైనా వినియోగించుకునేలా ఫ్యామిలీ కేర్ లీవ్‌గా మార్పు చేయిస్తానని చెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లోని పీఆర్టీయూ స్టేట్ ఆఫీసులో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా హాజరైన శ్రీపాల్ రెడ్డి.. వివిధ జిల్లాల మహిళా టీచర్లను సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్– ఖమ్మం– నల్గొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా గెలిచిన వెంటనే టీచర్లు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని తెలిపారు. వివిధ రకాల పెండింగ్ బకాయిలను దశల వారీగా చెల్లిస్తామని, దీనికోసం ప్రతి నెలా రూ.800 కోట్లు రిలీజ్ చేస్తామని సీఎం హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
కాగా, ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా పీఆర్టీయూ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన శ్రీపాల్ రెడ్డికి.. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్ రెడ్డి, మాజీ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వెంకట్ రెడ్డి, గుండు లక్ష్మణ్ తదితరులు స్వాగతం పలికారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పీఆర్టీయూ నేతలు శ్రీపాల్ రెడ్డికి అభినందనలు చెప్పారు.