- 5శాతం లేనోళ్లకు 10 శాతంఎట్ల అమలు చేస్తరు
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుతో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. శుక్రవారం సెక్రటేరియెట్ మీడియా సెంటర్లో తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడారు. రిజర్వేషన్ల కోటా ఫిక్స్ చేయకుండా 10 శాతం రిజర్వేషన్లను గత ప్రభుత్వం అమలు చేసిందన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుతో ఇటీవల డీఎస్సీలో అగ్రవర్ణాలకు వంద మందికి రావాల్సిన ఉద్యోగాలు 1,100 మందికి వస్తున్నాయన్నారు. 5 శాతం లేని ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 10 శాతం ఎలా అమలు చేస్తారని మల్లన్న ప్రశ్నించారు. ఈడబ్ల్యూఎస్ పై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. బీజేపీ తెచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటా తమిళనాడు లాంటి రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు.
ఈడబ్ల్యూఎస్ వారికి రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల మెరిట్ తెచ్చుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఓపెన్ కేటగిరీలో అవకాశాలు కోల్పోతున్నారన్నారు. వీరు మెరిట్‌తో ఓపెన్ కేటగిరీలో జాబ్ పొందినప్పుడే, ఇదే కేటగిరీలోని కింది అభ్యర్థులకు వారి కేటగిరీలో ఉద్యోగం దక్కు తుందన్నారు. కానీ ఈడబ్ల్యూఎస్ విధానం వల్ల ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ కావాల్సిన ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ అభ్యర్థులు కిందికి దిగి వారి రిజర్వేషన్ కేటగిరీలోకి వెళ్లాల్సి వస్తోందని వివరించారు ఫలితంగా కొంచం తక్కువ మార్కులు వచ్చి బోర్డర్‌లో సెలెక్ట్ కావాల్సిన రిజర్వుడ్ కేటగిరీ అభ్యర్థులు ఉద్యోగం పొందలేకపోతున్నారని తీన్మార్ మల్లన్న తెలిపారు.