యువత పాలిటిక్స్​లోకి రావాలి : మోదీ

యువత  పాలిటిక్స్​లోకి రావాలి : మోదీ

 

  • లక్ష మంది యూత్​ను రాజకీయాలతో కనెక్ట్ చేయాలి: మోదీ 
  • జనవరిలో ‘యంగ్ లీడర్స్ డైలాగ్’ 
  • 116వ ‘మన్ కీ బాత్’లో ప్రధాని ప్రసంగం

 
న్యూఢిల్లీ: ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేసేందుకు ‘‘వికసిత్​ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్” కార్యక్రమం చేపడుతున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ ఏడాది స్వామి వివేకానంద జయంతి చాలా ప్రత్యేకంగా ఉంటుందన్నారు. లక్ష మంది యువతను పాలిటిక్స్ తో కనెక్ట్ చేయడంలో భాగంగా జనవరి 11, 12వ తేదీల్లో ఢిల్లీలోని భారత మండపంలో యంగ్ లీడర్స్ డైలాగ్ సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. పొలిటికల్ బ్యాక్​గ్రౌండ్​లేని యువత దీనికి హాజరుకావాలని కోరారు.  ఆదివారం 116వ ‘మన్​కీ బాత్’ ఎపిసోడ్​లో ప్రధాని మాట్లాడారు. 

ఎన్​సీసీతో అమూల్యమైన అనుభవాలు

నేషనల్ క్యాడెట్ కోర్(ఎన్​సీసీ)ను మోదీ తన ప్రసంగంలో ప్రశంసించారు. ఎన్​సీసీ మనకు స్కూల్​, కాలేజీలే రోజులను గుర్తుచేస్తుందని అన్నారు. ‘‘నేను స్వయంగా ఎన్‌సీసీ క్యాడెట్‌ను. దాన్నుంచి నేను ఎంతో అమూల్యమైన అనుభవాన్ని పొందాను. ఎన్‌సీసీ యువతలో క్రమశిక్షణ, నాయకత్వం, సేవా స్ఫూర్తిని పెంపొందిస్తుంది” అని చెప్పారు.

స్ఫూర్తినిచ్చే ప్రవాసుల స్టోరీలు చెప్పండి

ప్రపంచవ్యాప్తంగా తమదైన ముద్ర వేసిన, స్వాతంత్ర్య పోరాటాలకు దోహదపడిన, మన వారసత్వాన్ని కాపాడిన ప్రవాస భారతీయుల స్ఫూర్తిదాయకమైన కథలను మనం కీర్తించాలని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘ఇండియన్ డయాస్పోరా స్టోరీస్” అనే హ్యాష్‌ట్యాగ్‌ తో నమో యాప్ లో ఆ స్టోరీలను షేర్ చేయండి” అని ఆయన పిలుపునిచ్చారు. 

చిల్డ్రన్ లైబ్రరీలు భేష్..

చిన్నారుల లైబ్రరీల ఏర్పాటులో హైదరాబాద్‌కు చెందిన ‘ది ఫుడ్‌ ఫర్‌ థాట్‌’అనే ఫౌండేషన్‌ చేస్తోన్న కృషిని ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో ప్రశంసించారు. ఈ సంస్థ అనేక లైబ్రరీలను చిన్నారుల కోసం స్థాపించడం గొప్పవిషయమని కొనియాడారు. విద్యార్థులు చదువుకునేందుకు లైబ్రరీ కంటే మంచి స్థలం ఇంకేముందని మెచ్చుకున్నారు. ఇటువంటి లైబ్రరీలను స్థాపించి చదువుపై మక్కువ కలిగించే ఈ ఐడియా చాలా బాగుందని తెలిపారు. ‘ది ఫుడ్‌ ఫర్‌ థాట్‌’ఫౌండేషన్‌ సేవలను ప్రస్తావించారు. చిన్నారుల చదువుల కోసం అనేక ప్రయోగాలు జరుగుతున్నాయని మోదీ చెప్పారు. ఈ ప్రయోగాలతో పిల్లల సృజనాత్మకతను, పుస్తకాలపై ప్రేమను పెంపొందించేందుకు ఎంతో మంది ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అలాగే చెన్నై, బిహార్ రాష్ట్రాల్లోనూ చిన్నారుల కోసం లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్న పలువురి ప్రయత్నలనూ ప్రధాని ప్రస్తావించారు.