- వరంగల్ డిక్లరేషన్ అమలు చేయాలి
- పార్టీలకతీతంగా రైతుల సమస్యలపై పోరాటం
- భారతీయ కిసాన్ సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మోహిన్ మోహన్ మిశ్రా
కామారెడ్డి, కామారెడ్డి టౌన్, వెలుగు: రైతుల సమస్యలు పరిష్కరిస్తామంటే వారు మోసపోయేస్థితిలో లేరని భారయతీ కిసాన్ సంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి మోహిన్ మోహన్ మిశ్రా పేర్కొన్నారు. భారతీయ కిసాన్ సంఘ్ రాష్ర్ట మహాసభ శనివారం కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో జరిగింది. సభలో వ్యవసాయ రంగం, రైతుల సమస్యలపై చర్చించి వాటిని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పరిష్కరించాలని కోరుతూ తీర్మానాలు చేశారు. సభకు చీఫ్ గెస్టుగా హాజరైన జాతీయ ప్రధాన కార్యదర్శి మోహిన్ మోహన్ మిశ్రా మాట్లాడుతూ.. భారతీయ కిసాన్ సంఘ్ పార్టీలకతీతంగా రైతుల కోసం పని చేస్తుందన్నారు. ఆయా రాష్ర్టాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. రైతుల సమస్యలు పట్టించుకోకపోతే ఎన్నికల్లో తమ సత్తా చూపారన్నారు. వ్యవసాయ ఉత్పత్తుల కల్తీలను అరికట్టాలని, మార్కెట్లో దళారీ వ్యవస్థను రూపు మాపాలన్నారు. పంటలకు గిట్టుబాటు ధర పెంచాలన్నారు. ఎన్నికలకు ముందు రైతుల కోసం ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ అమలు చేయాలన్నారు.
రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. స్టేట్ ప్రెసిడెంట్‌గా రెండోసారి జోగినపల్లి శ్రీరంగారావు, జనరల్ సెక్రటరీగా అంబీర్ ఆనంద్‌రావు, వైస్ ప్రెసిడెంట్లుగా పన్యాల వెంకట్‌రెడ్డి, గైని నగేశ్, ఉడుముల లావణ్య, ఎం.రాజిరెడ్డి, ట్రెజరర్‌గా లింగనోళ్ల మాణిక్‌రెడ్డి, సెక్రటరీలుగా కొమిరెడ్డి అంజన్న, చేవూరి విజయ్‌భాస్కర్, రవీందర్‌రాజు, బోరంపేట మల్లారెడ్డి, మహిళ ప్రముఖ్ ఎల్. ప్రముఖ, కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ ఏ.వి.రావు, సురేందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, మురళీ, సరసాని భూంరెడ్డి, డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి, దశరథ్జాదవ్, గడిగె గజేందర్గౌడ్, లొంక వెంకట్‌రెడ్డి, విజయ్ గోపాల్‌రావు, సత్యనారాయణ, వినోద్‌రావు ఎన్నికయ్యారు.