- రూ.-8 కోట్లకు పైగా డబ్బు పక్కదారి!
- కేసు నమోదైనా ముందుకు సాగని ఎంక్వైరీ
- అధికారుల -నిర్లక్ష్యంపై అనుమానాలు
గద్వాల, వెలుగు: డబుల్ క్లెయిమ్‌తో కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వ్యవహారంలో డబ్బు రికవరీ అవుతుందా? లేదా? అనే చర్చ జోరుగా సాగుతోంది. హైకోర్టు డైరెక్షన్ తో కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికీ ఈ కేసులో ఎలాంటి పురోగతి సాధించకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలో కీలక కేసులైన డీపీవో ఆఫీస్, తహసీల్దార్ ఆఫీస్ లోని రికార్డు రూమ్‌కు నిప్పు వ్యవహారాల్లో బడాబాబులు ఉండడంతో కేసులు నీరుగారిపోయాయని, అదే తరహాలో ఈ కేసు విచారణ కూడా కొనసాగుతుందనే విమర్శలున్నాయి.
నెట్టెంపాడు లిఫ్ట్, జూరాల ల్యాండ్ అక్విజేషన్ వ్యవహారంలో డబుల్ క్లెయిమ్ కుంభకోణంలో కోట్ల రూపాయలు దండుకున్నారు. ఎట్టకేలకు హైకోర్టు డైరెక్షన్ తో కేసు నమోదైంది. ల్యాండ్ అక్విజేషన్ వ్యవహారంలో డబుల్ ఎంట్రీ చేసి రూ.3,08,33,160 తమ సొంత అకౌంట్లకు బదిలీ చేసుకున్నట్లు అంతర్గతంగా జరిగిన ఎంక్వైరీ తరువాత హైకోర్టు డైరెక్షన్స్ తో ఇటీవల కేసు నమోదైంది. ఈ కేసు గద్వాల కోర్టులో కలకలం రేపింది. కుంభకోణం వెనక ఉన్న పెద్దలు ఈ కేసు ముందుకు కదలకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
ఎంక్వైరీ చేయట్లే..
హైకోర్టు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేయాలని డైరెక్షన్ ఇవ్వడంతో కోర్టు సీనియర్ సూపరింటెండెంట్ నిర్మల అక్టోబర్ 22న పోలీసులకు ఫిర్యాదు చేశారు. 477 ఏ, 409, 465, 468, 420, బి రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కానీ, ఇప్పటివరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఎవరిని విచారించిన దాఖలాలు లేవు. సామాన్యులపై కేసులు నమోదైతే అత్యుత్సాహం చూపే పోలీసులు కోట్ల రూపాయలు కొల్లగొట్టినా ఇప్పటివరకు చర్యలు ప్రారంభించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
2016 డిసెంబర్ 24 నుంచి 2021 ఆగస్టు 16 వరకు డబుల్ ఎంట్రీ చేస్తూ రైతుల ముసుగులో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. అయితే ఏండ్ల కొద్ది జరిగిన కుంభకోణాన్ని ఆలస్యంగా గుర్తించి కేసు నమోదు చేయించినప్పటికీ, ఎంక్వైరీ స్లోగా జరగడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఫిర్యాదులో రూ.3 కోట్ల వరకు డబుల్ క్లైమ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నప్పటికీ, రూ.8 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు చర్చ జరుగుతోంది. ఈ కేసుతో చాలా మందికి సంబంధం ఉందని, వారందరి పేర్లను కేసులో చేర్చాలనే డిమాండ్ వస్తోంది.
కీలక కేసుల్లో సప్పుడు చేస్తలేరు..
జోగులాంబ గద్వాల జిల్లాలో కీలక కేసులన్నింటిలో పోలీసులు స్పందించడం లేదనే విమర్శలున్నాయి. 2022 అక్టోబర్ 25న మానవపాడు తహసీల్దార్ ఆఫీస్ లోని రికార్డ్ రూమ్ దగ్ధం కేసును ఇప్పటివరకు తేల్చలేదు. రెండేండ్ల కింద డీపీవో ఆఫీస్‌కు నిప్పు పెట్టిన కేసులో కూడా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. మల్దకల్ మండలం బిజ్వారం గ్రామానికి చెందిన బాలిక సూసైడ్ కేసులో కూడా ఎలాంటి పురోగతి లేకుండా పోయింది. ఇప్పుడు కోర్టులో డబుల్ క్లైమ్ కేసు కూడా ఎంక్వైరీ లేకుండానే రోజులు గడిచిపోతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఎంక్వైరీ ప్రాసెస్ లో ఉంది
కోర్టులో జరిగిన కేసుపై ఎంక్వైరీ ప్రాసెస్ లో ఉంది. అక్కడ జరిగింది సీరియస్ అఫెన్స్. ఇందులో ఎవరినీ వదిలి పెట్టేది లేదు. సీరియస్ గా ఎంక్వైరీ చేస్తున్నాం. వారం రోజుల్లో ఈ కేసు కొలిక్కి వస్తుంది. కీలక కేసులన్నింటిపై దృష్టి పెడతాం. సత్యనారాయణ, డీఎస్పీ, గద్వాల