జాక్వెలిన్  ఫెర్నాండెజ్కు ఢిల్లీ కోర్టులో ఊరట

జాక్వెలిన్  ఫెర్నాండెజ్కు ఢిల్లీ కోర్టులో ఊరట

న్యూఢిల్లీ: బాలీవుడ్  నటి జాక్వెలిన్  ఫెర్నాండెజ్  కు ఢిల్లీ కోర్టులో ఊరట దక్కింది. రూ.200 కోట్ల దోపిడీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న జాక్వెలిన్  ఫెర్నాండెజ్  కు పాటియాలా హౌస్  కోర్టు ఇవాళ మధ్యంతర బెయిల్  ఇచ్చింది. కేసులో జాక్వెలిన్ను నిందితురాలిగా పేర్కొంటూ ఈడీ అనుబంధ ఛార్జ్ షీట్  దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్ పరిశీలించిన కోర్టు సెప్టెంబరు 26 న కోర్టు ఎదుట హాజరుకావాలని సమన్లు ఇచ్చింది.

కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ పాటియాలా హౌస్  కోర్టుకు జాక్వెలిన్ హాజరయ్యారు. ఇదే సమయంలో బెయిల్  కోసం ఆమె తరఫు న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం ఈడీ స్పందన కోరింది. రెగ్యులర్  బెయిల్  అంశం కోర్టులో పెండింగ్  లో ఉన్నందున.. అప్పటివరకు మధ్యంతర బెయిల్  ఇవ్వాలని జాక్వెలిన్  న్యాయవాది కోరారు. ఈ అభ్యర్థనకు కోర్టు అంగీకరించింది. 

రూ.50వేల పూచికత్తుపై మధ్యంతర బెయిల్

రూ.50 వేల పూచికత్తుపై జాక్వెలిన్ కు మధ్యంతర బెయిల్  ఇచ్చింది. దీనిపై తదుపరి విచారణను వచ్చే అక్టోబరు నెల 22వ తేదీకి వాయిదా వేసింది. రూ.200 కోట్ల మనీలాండరింగ్  కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్  నుంచి జాక్వెలిన్ ఖరీదైన గిప్టులు తీసుకున్నట్టు ఆరోపణలొచ్చాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఈడీ... కేసులో ఆమెను నిందితురాలిగా చేర్చింది. జాక్వెలిన్ కు సంబంధించి రూ.7కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

కొద్ది రోజుల క్రితం ఢిల్లీ పోలీసులు ఇదే కేసులో ఆమెను రెండు సార్లు విచారించారు. సుకేశ్ చంద్రశేఖర్ నుంచి తీసుకున్న ఖరీదైన గిప్టులు, ఇతర ఆర్థిక లావాదేవీల గురించి ఆరా తీశారు. తర్వాత, జాక్వెలిన్  స్టైలిస్ట్  లేపాక్షి ఎల్లవాడిని కూడా ఢిల్లీ క్రైం పోలీసులు ప్రశ్నించారు. సుకేశ్తో జాక్వెలిన్  సన్నిహిత సంబంధాలు తనకు తెలుసుని విచారణలో లేపాక్షి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.