IND v ENG: ఆ పిచ్‌లపై రోహిత్ శర్మ.. బ్రాడ్‌మన్‌లా ఆడతాడు: ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్

IND v ENG: ఆ పిచ్‌లపై రోహిత్ శర్మ.. బ్రాడ్‌మన్‌లా ఆడతాడు: ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్

భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరగడానికి మరో రెండు వారల సమయం ఉంది. 5 టెస్టులు ఆడటానికి ఇంగ్లాండ్ మరోవారంలో భారత గడ్డపై ఆడుతుంది. సాధారణంగా ఇండియాలో టెస్ట్ మ్యాచ్ అంటే టర్నింగ్ వికెట్స్ ఉంటాయని మనకందరికీ తెలుసు. స్పిన్ కు అనుకూలించే ఈ పిచ్ లపై ఎంతటి స్టార్ బ్యాటర్ అయినా పరుగుల కోసం చెమటోడ్చాల్సిందే. బంతి అనూహ్యంగా టర్న్ అయ్యే ఇలాంటి వికెట్ పై రోహిత్ శర్మ బాగా ఆడతాడని.. ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటి పనేసర్ వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలో రోహిత్ ను ఏకంగా డాన్ బ్రాడ్ మన్ తో పోల్చాడు. 
 
టర్నింగ్ పిచ్ పై సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, VVS లక్ష్మణ్ వంటి క్రికెట్ దిగ్గజాలు స్పిన్‌ బాగా ఆడి తమదైన ముద్ర వేశారు. అయితే ప్రస్తుత క్రికెట్ లో రోహిత్ టర్నింగ్ వికెట్ లపై బాగా ఆడతాడని.. అతడి వికెట్ వీలైనంత త్వరగా తీస్తే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ పై పట్టు సాధిస్తుందని అభిప్రాయపడ్డాడు. టర్నింగ్ పిచ్‌లలో రోహిత్ డాన్ బ్రాడ్‌మాన్ లా బ్యాటింగ్ చేస్తాడని.. అతని రికార్డు అద్భుతంగా ఉందని హిట్ మ్యాన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్ రోహిత్‌ను త్వరగా ఔట్ చేస్తే భారత్ ప్లాన్ బికి వెళ్తుందని..యువ బ్యాటర్‌లను ఒత్తిడిలోకి నెట్టడం కీలకం అని హిందుస్థాన్ టైమ్స్ లో పనేసర్ అన్నారు. 

2021లో ఇంగ్లండ్‌.. భారత్ కు వచ్చినప్పుడు టెస్టు సిరీస్‌లో రోహిత్ అద్భుత ప్రదర్శనను పనేసర్ గుర్తు చేసాడు. ఈ సిరీస్ లో రోహిత్..      57.50 సగటుతో 345 పరుగులు చేశాడు. వీటిలో ఒక సెంచరీతో పాటు అర్ధ సెంచరీ కూడా ఉంది. రోహిత్ ను మినహాయిస్తే మిగిలిన ప్లేయర్లు ఈ సిరీస్ లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు. ఈ ఇంటర్వ్యూ లో పనేసర్ అశ్విన్ ను పొగుడుతూ.. అతడొక యాప్ లాంటివాడని.. ఎప్పటికప్పుడూ అప్ డేట్ అవుతూ ఉంటాడని తెలిపాడు. 

ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు హైదరాబాద్ లో జరగనుంది. విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచీ, ధర్మశాలలో వరుసగా 2,3,4,5 టెస్టులు ఆడాల్సి ఉంది. గత నెలలో ఇంగ్లాండ్ జట్టును ప్రకటించగా.. త్వరలో భారత జట్టుకు ఎంపిక చేస్తారు. ఇప్పటికే బజ్ బాల్ ను కొనసాగిస్తామని చెప్పిన ఇంగ్లీష్ జట్టు భారత్ ను బయపెడుతుందో లేకపోతో వారు తీసుకున్న గోతిలో వారే పెడతారేమో చూడాలి.