వాట్సాప్​తోటే ఎక్కువ మోసాలు.. ఈ యాప్ ద్వారానే నిరుడు మూడు నెలల్లో 43,797 ఫ్రాడ్స్​

వాట్సాప్​తోటే ఎక్కువ మోసాలు.. ఈ యాప్ ద్వారానే నిరుడు మూడు నెలల్లో 43,797 ఫ్రాడ్స్​
  • టెలిగ్రామ్ ద్వారా 22,680 ఘటనలు 

  • ఫేస్​బుక్ ద్వారా ఇల్లీగల్ లోన్ ​యాడ్స్​తో టోకరా  

  • మూడేండ్లలో 11 రెట్లు పెరిగిన సైబర్ ఫైనాన్షియల్ క్రైమ్స్ ​

  • 2023లో రూ.7,476 కోట్లు దోచిన కేటుగాళ్లు

  • 2024 తొలి మూడు నెలల్లోనే రూ.4,249 కోట్ల దోపిడీ

  • రికవరీ చేస్తున్నది 12 శాతం వరకే 

  • కేంద్ర హోం శాఖ వార్షిక నివేదికలో వెల్లడి 

హైదరాబాద్, వెలుగు: 
వాట్సాప్​ ద్వారా కాల్ చేస్తరు.. ‘నీ పేరుతో వచ్చిన కొరియర్ లో డ్రగ్స్​దొరికినయ్’ అని బెదిరిస్తరు. పోలీసులమని, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నమని భయపెడతరు. కేసు కొట్టేయాలంటే లక్షలు ఇవ్వాలంటరు. ఆడవాళ్లయితే అసభ్యంగా కూడా ప్రవర్తిస్తరు. చివరికి అందినకాడికి దోచుకుని పరారైతరు. ఇదీ ఈ మధ్య కాలంలో సైబర్ కేటుగాళ్లు పేట్రేగిపోతూ జనాలను మోసం చేస్తున్న తీరు. తాజాగా విడుదలైన కేంద్ర హోంశాఖ వార్షిక నివేదిక 2023లోనూ ఇలాంటి నివ్వెరపోయే విషయాలు వెల్లడయ్యాయి. జనాల సోషల్ మీడియా వాడకాన్ని ఆసరాగా చేసుకున్న సైబర్ దొంగలు వేల కోట్లు దోచుకుంటున్నట్టు తేలింది. అయితే, వాట్సాప్ ద్వారానే అత్యధిక సైబర్ మోసాలు, నేరాలు జరుగుతున్నట్టు రిపోర్ట్​ స్పష్టం చేసింది. 2024 తొలి మూడు నెలల్లో ఒక్క వాట్సాప్ ద్వారానే 43,797 సైబర్ మోసాలు జరిగినట్టు రిపోర్ట్​లో వెల్లడైంది. వాట్సాప్ తర్వాత సైబర్ దొంగలు టెలిగ్రామ్​ను మోసాలకు అడ్డాగా మార్చుకుంటున్నట్టు తేలింది. టెలిగ్రామ్ ద్వారా 22,680 సైబర్ మోసాలు జరిగినట్టు రిపోర్ట్ స్పష్టం చేసింది. ఇన్​స్టాగ్రామ్ ద్వారా19,800, ఫేస్​బుక్​ద్వారా 20,766, యూట్యూబ్ ద్వారా 3,882 సైబర్ మోసాలు జరిగినట్టు వెల్లడించింది. 

 

అంతా గూగుల్ ద్వారానే..

సోషల్ మీడియా ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్న దుండగులు గూగుల్ సర్వీసెస్​ను ప్రధాన వేదికగా వాడుకుంటున్నట్టు రిపోర్ట్ వెల్లడించింది. గూగుల్ యాడ్స్ ద్వారా యూజర్లకు అడ్వర్టైజ్​మెంట్లను ఫార్వర్డ్ చేసి డబ్బులను కొల్లగొడుతున్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ స్కాములను పిగ్ బుచరింగ్ స్కామ్ లేదా ఇన్వెస్ట్​మెంట్ స్కామ్​గా కేంద్రం చెబుతున్నది. ఈ స్కామ్​ల ద్వారా సైబర్ దొంగలు పెద్ద మొత్తంలో డబ్బును దోచేస్తున్నారని పేర్కొంది. ఎక్కువగా నిరుద్యోగ యువత, గృహిణులు, విద్యార్థులు, అవసరంలో ఉన్నోళ్లను టార్గెట్ చేసుకుని మోసాలకు పాల్పడుతున్నట్టు తేల్చింది.  

సైబర్ క్రైమ్స్ మస్తు పెరిగినయ్​

మూడేండ్లలో సోషల్ మీడియాలోనే కాకుండా వివిధ మార్గాల్లో సైబర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కేసులు భారీగా పెరిగాయి. 2021తో పోలిస్తే ఏకంగా 11 రెట్లు పెరగడం కలవరపరుస్తోంది. అలాగే జనం పోగొట్టుకుంటున్న అమౌంట్ కూడా పెరిగిపోతున్నది. 2021లో సైబర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్​పై 1,36,604 కేసులు నమోదైతే.. 2023లో ఆ సంఖ్య 11,29,519కి పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. 2024 తొలి మూడు నెలల్లోనే 3,81,854 కేసులు నమోదయ్యాయి. 2021లో 547.73 కోట్లను సైబర్ నేరగాళ్లు దోచేస్తే.. 2023 నాటికి అది రూ.7,476.54 కోట్లకు పెరిగింది. 2024 తొలి మూడు నెలల్లోనే రూ.4,249.96 కోట్ల మేరకు సైబర్ కేటుగాళ్లు దోచేశారు. అయితే, సైబర్ నేరగాళ్లు దోచుకున్న దాంట్లో రికవరీ చేస్తున్న మొత్తం మాత్రం 12 శాతం వరకే ఉంటున్నది.  

ఇల్లీగల్ లోన్ యాప్స్​కు అడ్డా ఫేస్​బుక్​

అక్రమంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు లోన్​యాప్​లు.. ఫేస్​బుక్​నే అడ్డాగా మార్చుకున్నట్టు కేంద్ర ప్రభుత్వ రిపోర్ట్ స్పష్టం చేసింది. కొందరు సైబర్ నేరగాళ్లు ఫేస్​బుక్ యాడ్స్ ద్వారా ఇల్లీగల్ లోన్ యాప్​ల గురించి ప్రకటనలు ఇస్తున్నట్టు తేల్చింది. ఆ లింక్​లనూ క్లిక్ చేయడం ద్వారా ప్రజలు డబ్బును పోగొట్టుకుంటున్నారని తెలిపింది. దీనిపై ఇప్పటికే ఫేస్​బుక్ సంస్థకు రిపోర్ట్ చేసినట్టు నివేదికలో కేంద్రం వెల్లడించింది. ఇక, గూగుల్​లో లోపాలున్న విషయాలు, ముప్పు పొంచి ఉన్న అంశాలపైనా గూగుల్​కు తెలియజేస్తున్నట్టు రిపోర్ట్​లో పేర్కొంది. అక్రమ డిజిటల్ లోన్ యాప్​లు, సైబర్ నేరగాళ్లు గూగుల్​లో చొరబడేందుకు అనువుగా ఉన్న ఫైర్​బేస్ డొమెయిన్, గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ద్వారా ఆండ్రాయిడ్ బ్యాంకింగ్ మాల్వేర్లను బ్లాక్ చేయడం, పుషింగ్ అడ్వర్టైజర్ల జాబితా వంటి విషయాలపై గూగుల్​తో చర్చిస్తున్నట్టు కేంద్రం వివరించింది.   
ఏడాది

ఏడాదివారీగా సైబర్ ఫైనాన్షియల్ క్రైమ్స్..

ఏడాది    ఫిర్యాదులు    దోచిన    బ్యాంకులు ఫ్రీజ్ చేసిన
        డబ్బు(రూ.కోట్లలో)    మొత్తం(రూ.కోట్లలో)

2021    1,36,604    547.73    36.40
2022    5,13,334    2,295.90    169.04
2023    11,29,519    7,476.54    921.58
2024 (మార్చి వరకు)    3,81,854    4,249.96    478.91 


2024 తొలి మూడు నెలల్లో 
సోషల్ మీడియా ద్వారా జరిగిన నేరాలు

ప్లాట్​ఫాం    జనవరి    ఫిబ్రవరి    మార్చి

వాట్సాప్​    15,355    13,696    14,746
టెలిగ్రామ్​    8,462    6,567    7,651
ఇన్​స్టాగ్రామ్​    6,708    5,940    7,152
ఫేస్​బుక్​    6,525    7,190    7,051
యూట్యూబ్​    1,591    1,156    1,135