సూర్యనమస్కారాలు చేస్తే .. ఆరోగ్యంతో పాటు మనశ్శాంతి బోనస్​...

సూర్యనమస్కారాలు చేస్తే .. ఆరోగ్యంతో పాటు మనశ్శాంతి బోనస్​...

ఆరోగ్యం కావాలంటే శరీరాన్ని కదిలించాలని అందరికీ తెలుసు. కానీ  ఎక్సర్సైజ్, యోగా చెయ్యడానికి టైం ఉండాలి కదా?  ఈ రోజుల్లో  దేనికీ టైం దొరకడం లేదు . జాబుకెళ్లి వచ్చేసరికే సరిపోతుంది.. అందుకే తక్కువ టైం కేటాయించి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఒక దారి ఉంది. అవే సూర్య నమస్కారాలు. ఊరికెళ్లినా, టూర్ కెళ్లినా ఎక్కడైనా ఎప్పుడైనా వీటిని చేసుకోవచ్చు. ఇందులో ఉండే పన్నెండు ఆసనాలు వేస్తేనే ఒక సూర్యనమస్కారం పూర్తయినట్టు. ఒక్క నమస్కారానికి మూడు నిమిషాలంతే! రోజూ సూర్యనమస్కారాలు చేస్తే చాలు చక్కని శరీరాకృతితో పాటు.. మనశ్శాంతి బోనస్ గా లభిస్తుంది.

చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా ఓపిక ఉన్నంత వరకు సాధ్యమైనన్ని నమస్కారాలు చేసుకోవచ్చు. సూర్యుడు ఉదయించేటప్పుడు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పన్నెండు ఆసనాలను ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా చేస్తే.. శరీరం ఫ్లెక్సిబుల్గా మారుతుంది. కొంచెం మధ్యస్థ వేగంతో చేస్తే... చక్కని శరీరాకృతిని పొందవచ్చు. వేగంగా చేస్తే గుండె ఆరోగ్యానికి మంచిది. అధిక బరువు కూడా తగ్గుతారు. ఈ సూర్య నమస్కారాలను రోజు ప్రాక్టీస్ చేస్తే.. జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. రక్తప్రసరణ మంచిగా జరిగి జుట్టు కూడా నెరవదు. వెన్నెముక, మెడను ఫ్లెక్సిబుల్గా మారుస్తాయి. మానసిక బలం పెరిగి జ్ఞాపకశక్తి కూడా మెరగవుతుంది. మహిళలయితే రుతుచక్రం సమస్యల నుంచి బయటపడతారు.

1. ప్రార్ధనాసన: పాదాలు రెండు దగ్గరగా ఉంచి నిటారుగా నిలబడాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ రెండు చేతులను ఎత్తి, శ్వాస వదులుతూ రెండు చేతులను నమస్కార ముద్రలోకి తీసుకురావాలి.
2. హస్త ఉత్తానాసన: శ్వాస తీసుకుంటూ రెండు చేతులను పైకి ఎత్తి వెనక్కి తీసుకురావాలి.  చేతులను వీలైనంత పైకెత్తాలి.
3.  హస్తపాదాసన : నిటారుగా నిలబడి శ్వాస వదులుతూ ముందుకు వంగాలి.శ్వాసను పూర్తిగా వదిలేసి చేతులతో పాదాలను తాకాలి.
4. అశ్వ సంచాలానాసన:   శ్వాస తీసుకుంటూ కుడి కాలుని వెనక్కి చాపాలి. ఎంతవ రకు సాగాతీయగలిగితే అంత వరకు కుడి మోకాలు భూమికి దగ్గరగా ఉంచి పైకి చూడాలి. ఈ సమయంలో ఎడమ పాదం సరిగ్గా రెండు అరచేతులకు మధ్యలో ఉండాలి.
5.దండాసన: అశ్వసంచాలానాసన తర్వాత వెంటనే శ్వాస తీసుకుంటూ ఎడమ కాలుని కూడా వెనక్కి చాపాలి.  శరీరాన్ని భూమికి సమాంతరంగా ఉంచాలి.
6. అష్టాంగాసన: నెమ్మదిగా మోకాళ్లను భూమి మీదకు తీసుకువచ్చి శ్వాస వదలాలి.  తుంటిని పైకి ఎత్తి.. ఛాతిని, గడ్డాన్ని నేలకు ఆన్చాలి. రెండు చేతులు, రెండు పాదాలు, రెండుమోకాళ్లు, ఛాతి, గద్దం ఈ ఎనిమిది శరీర భాగాలు భూమిని తాకుతాయి కాబట్టి దీనిని అష్టాంగాసన అంటారు.
7.భుజంగాసన:  ఛాతిని పైకి లేపి.. శ్వాస తీసుకుంటూ పైకి చూడాలి.
8. పర్వతాసన:  శ్వాసను వదులుతూ తుంటి ఎముకలను పైకి, ఛాతి కిందకు తీసుకెళ్లాలి. ఈ ఆసనం పర్వతాన్ని పోలి ఉంటుంది.
9. హస్తపాదాసన: శ్వాస వదులుతూ ఎడమ పాదాన్ని ముందుకు తెచ్చి పైన చెప్పిన విధంగా హస్తపాదాసనాన్ని రిపీట్ చేయాలి.
10 హస్త ఉత్తానాసన: ఈ సారి శ్వాస తీసుకుంటా మొదట్లో చేసినట్టుగానే హస్త ఉత్తానాసనాన్ని రిపీట్ చేయాలి. దీని తర్వాత మళ్లీ ప్రా ర్థనాసన రిపీట్ చేయాలి.
11. అశ్వసంచాలానాసన: పర్వతాసన పూర్తి కాగానే ఈ సారి శ్వాస తీసుకుంటూ కుడి పాదాన్ని రెండు చేతుల మధ్య లోకి తీసుకెళ్లి మళ్లీ అశ్వసంచ లలానసన చేయాలి.
12.  ప్రార్ధనాసన: ఈసారి పాదాలు రెండు దగ్గరగా ఉంచి నిటారుగా నిలబడి ప్రార్ధనాసనాన్ని రిపీట్​ చేయాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ రెండు చేతులను ఎత్తి, శ్వాస వదులుతూ రెండు చేతులను నమస్కార ముద్రలోకి తీసుకురావాలి.