మహారాష్ట్ర, జార్ఖండ్​లో ఎన్డీయేకే మొగ్గు

మహారాష్ట్ర, జార్ఖండ్​లో ఎన్డీయేకే మొగ్గు
  • రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలఎగ్జిట్ పోల్స్​లో బీజేపీదే హవా
  • రెండు చోట్లా కాంగ్రెస్ కూటమి ఓడిపోతుందన్న సర్వేలు 
  • అసలు ఫలితాలు తేలేది ఎల్లుండే

ముంబై/రాంచీ: మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమే గెలవనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన, ఎన్ సీపీతో కూడిన అధికార మహాయుతి కూటమి మళ్లీ పవర్ లోకి రానుందని.. జార్ఖండ్ లో అధికారంలో ఉన్న జేఎంఎం, కాంగ్రెస్ అలయెన్స్ ఓడిపోయి ప్రతిపక్ష ఎన్డీయే కూటమి గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయని ఎక్కువ సర్వే సంస్థలు అంచనా వేశాయి. బుధవారం సాయంత్రం రెండు రాష్ట్రాల్లో ఓటింగ్ పూర్తయిన వెంటనే ఆయా సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను విడుదల చేశాయి. అయితే, ఈ నెల 23న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను ఈసీ ప్రకటించనుంది. గత లోక్ సభ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చాలావరకూ తారుమారు అయ్యాయి. ఈసారి అంచనాలు నిజమైతే గనక.. మహారాష్ట్రలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ఎన్నికల్లో తీవ్రంగా శ్రమించిన మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి మరోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితం కానుంది. అటు జార్ఖండ్ లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ కూటమి ఈసారి పవర్ లోకి వచ్చే అవకాశం ఉంది.

మహారాష్ట్ర మళ్లీ ‘మహాయుతి’దే 

మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 సీట్లు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 145 సీట్లను గెలవాల్సి ఉంది. రాష్ట్రంలో మహాయుతి కూటమి ఈజీగా మెజార్టీ మార్క్ ను దాటి 150కిపైగా సీట్లను గెలుచుకోవచ్చని చాణక్య స్ట్రాటజీస్, మాట్రిజ్, పీపుల్స్ పల్స్, టైమ్స్ నౌ, ఎన్డీటీవీ వంటి సంస్థలు అంచనా వేశాయి. అయితే, రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని మరో మూడు సంస్థలు వెల్లడించాయి. మహాయుతికి 120కిపైగా సీట్లు మాత్రమే వస్తాయని దైనిక్ భాస్కర్, లోక్ శాహీ మరాఠీ రుద్ర, పీ మార్క్ సంస్థలు పేర్కొన్నాయి. అయితే, ఎంవీఏ మెజార్టీ మార్క్​ను దాటవచ్చని దైనిక్ భాస్కర్, పీ మార్క్ సంస్థలు చెప్పాయి. 

జార్ఖండ్​లో మారనున్న సర్కార్ 

జార్ఖండ్​లోనూ ఎన్డీయే కూటమికే అధికారం దక్కే అవకాశాలు ఉన్నాయని దాదాపు అన్ని సర్వే సంస్థలు స్పష్టం చేశాయి. రాష్ట్రంలో 81 అసెంబ్లీ సీట్లు ఉండగా, ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 41 సీట్లు అవసరం. ఎన్డీయే కూటమి మెజార్టీ మార్కును దాటుతుందని చాణక్య స్ట్రాటజీస్, మాట్రిజ్, పీపుల్స్ పల్స్, టైమ్స్ నౌ సంస్థలు అంచనా వేశాయి. 31 సీట్లు మాత్రమే రావచ్చని పీ‌‌ మార్క్, 37 సీట్లు గెలవొచ్చని దైనిక్ భాస్కర్, 39 సీట్లకు పరిమితం కావచ్చని ఎన్డీటీవీ వెల్లడించాయి. అయితే, జార్ఖండ్ లో కాంగ్రెస్, జేఎంఎం కూటమి తిరిగి అధికారంలోకి రానుందని యాక్సిస్ మైఇండియా ఒక్కటే అంచనా వేసింది.

2019 ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే..

మహారాష్ట్రలో 2019లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పగా.. జార్ఖండ్ లో మాత్రం వాస్తవ ఫలితాలకు కొంచెం దగ్గరగా వచ్చాయి. ఆ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 288 సీట్లకుగాను ఎన్డీఏ(శివసేన+బీజేపీ) కూటమి166 నుంచి 194 సీట్లను గెలుచుకోవచ్చని, యూపీఏ (కాంగ్రెస్+ఎన్ సీపీ)కు 72 నుంచి 90 సీట్లు రావచ్చని ఇండియా టుడే యాక్సిస్ సంస్థ తన ఎగ్జిట్ పోల్స్ లో అంచనా వేసింది. ఎన్డీఏకు ఏకంగా 243 సీట్లు వస్తాయని, యూపీఏ 41 సీట్లకే పరిమితమవుతుందని న్యూస్18–ఐపీఎస్ఓఎస్ సర్వే పేర్కొంది. ఎన్డీయేకు 216 నుంచి 230, యూపీఏకు 52 నుంచి 59 సీట్లు రావచ్చని రిపబ్లిక్–జన్ కీ బాత్ వెల్లడించింది. ఎన్డీయేకు 204, యూపీఏకు 69 సీట్లు రావచ్చని ఏబీపీ న్యూస్–సీవోటర్ సర్వే అంచనా వేసింది. అయితే, ఓట్ల లెక్కింపు తర్వాత ఈసీ ప్రకటించిన ఫలితాల్లో.. బీజేపీ 105, శివసేన 56 సీట్లను.. రెండూ కలిపి 161 సీట్లను గెలుచుకోగా.. కాంగ్రెస్ 44, ఎన్ సీపీ 54 కలిపి 98 సీట్లు గెలుచుకున్నాయి. ఇక 2019 జార్ఖండ్ ఎన్నికల్లో మొత్తం 81 సీట్లకుగాను యూపీఏ (జేఎంఎం+కాంగ్రెస్) 43 సీట్లను, బీజేపీ 27 సీట్లను గెలుచుకోవచ్చని ఇండియాటుడే యాక్సిస్ సంస్థ తన ఎగ్జిట్ పోల్స్ లో అంచనా వేసింది. హంగ్ అసెంబ్లీ ఏర్పడవచ్చని ఏబీపీ సీవోటర్ పేర్కొంది. యూపీఏకు 35, బీజేపీకి 32 సీట్లు, ఇతరులకు మిగతా సీట్లు రావచ్చని అంచనా వేసింది. అయితే, ఓట్ల లెక్కింపు తర్వాత వెల్లడైన అసలు ఫలితాల్లో యూపీఏ కూటమి 46 సీట్లను(జేఎంఎం 30, కాంగ్రెస్ 16) గెలుచుకోగా.. బీజేపీ 25 సీట్లకు పరిమితమైంది.

రెండుచోట్లా అతిపెద్ద పార్టీగా బీజేపీ: పీపుల్స్ పల్స్

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధ్వర్యంలోని కూటమి విజయం ఖాయమని పీపుల్స్ పల్స్ సంస్థ కూడా అంచనా వేసింది. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుందని వెల్లడించింది. మహారాష్ట్రలో 288 సీట్లకు గాను మహాయుతి కూటమికి 182 సీట్లకు అటూఇటూగా, ఎంవీఏ కూటమికి 97 సీట్లకు అటూఇటూగా రావచ్చని తెలిపింది. రాష్ట్రంలో బీజేపీ 102 నుంచి 120 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని పేర్కొంది. శివసేన (షిండే)కు 42 నుంచి 61 సీట్లు, ఎన్​సీపీ (అజిత్ పవార్) పార్టీకి 14 నుంచి 25 సీట్లు రావొచ్చొని అంచనా వేసింది. ఎంవీఏ కూటమిలోని కాంగ్రెస్​కు 24 నుంచి 44, శివసేన (యూబీటీ)కి 21 నుంచి 36, ఎన్​సీపీ (ఎస్పీ)కి 28 నుంచి 41 వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. జార్ఖండ్​లో 42 నుంచి 48 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించనుందని పేర్కొంది. ఎన్డీయే కూటమిలోని ఏజేఎస్​యూ పార్టీకి 2 నుంచి 5 సీట్లు రావచ్చని తెలిపింది. ఇండియా కూటమిలోని కాంగ్రెస్ కు 8 నుంచి 14, జేఎంఎంకు 16 నుంచి 23 సీట్లు, ఇతరులకు 6 నుంచి 10 స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.