మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ పట్టణంలో రెండు వారాల భయాందోళనల తర్వాత 20 మంది వ్యక్తులపై దాడి చేసిన కోతి ఎట్టకేలకు పట్టుబడింది. ఈ కోతిని పట్టిచ్చిన వారికి రూ.21వేల నగదు బహుమతిని కూడా అధికారులు అప్పట్లో ప్రకటించారు.
జూన్ 21న సాయంత్రం, ఉజ్జయిని నుంచి పిలిచిన రెస్క్యూ టీమ్.. స్థానిక అధికారులు, స్థానిక నివాసితులతో కలిసి మోస్ట్ వాంటెడ్ కోతిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. కోతిని గుర్తించడానికి బృందం డ్రోన్‌ను ఉపయోగించింది. బాణాలు ఉపయోగించి.. ఆపై దాన్ని బోనులో బంధించింది. అటవీ శాఖ సిబ్బంది ప్రశాంతంగా ఉన్న కోతిని జంతు రక్షక వాహనం వద్దకు తీసుకువెళుతుండగా జనం జై శ్రీరామ్స, జై బజరంగ్ బలి నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
15 రోజులలో కోతి దాడి చేసిన 20 మందిలో ఎనిమిది మంది పిల్లలు ఉన్నారు. కోతి.. ఇంటి పైకప్పులు, కిటికీల గుమ్మాలపై కూర్చుని, అకస్మాత్తుగా ప్రజలపైకి దూసుకుపోతుందని అధికారులు తెలిపారు. గాయపడిన వారిలో చాలా మందికి అనేక కుట్లు వేయాల్సిన లోతైన గాష్‌లు వచ్చాయన్నారు. కోతిని పట్టుకునేందుకు ఆ ప్రాంతంలో అధికారులు సీసీ టీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. కోతి ఓ వృద్ధుడిపై విరుచుకుపడి నేలపైకి లాగి దృశ్యాలు ఈ కెమెరాల్లో రికార్డయ్యాయి కూడా. సెకనుల పాటు జరిగిన ఈ దాడిలో వ్యక్తి తొడపై తీవ్ర గాయమైంది.
మున్సిపాలిటీకి ఆ కోతిని పట్టుకునే స్తోమత లేదు. మేము జిల్లా కలెక్టర్‌ను సంప్రదించాం. అతని సహాయంతో ఉజ్జయిని నుంచి అటవీ శాఖ రెస్క్యూ టీమ్‌ను పిలిపించాం. మున్సిపాలిటీ సిబ్బంది, స్థానికులు వారికి సహాయం చేశారు. కోతిని పట్టుకున్నందుకు మేము రూ.21వేల నగదు బహుమతిని అందించాం. మేము దానిని ఇప్పుడు జంతు రక్షక బృందానికి అందజేస్తాం అని రాజ్‌గఢ్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ వినోద్ సాహు తెలిపారు.
రాజ్‌గఢ్‌లోని స్థానిక బృందం గత రెండు వారాలుగా కోతిని పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదని అటవీ అధికారి గౌరవ్ గుప్తా తెలిపారు. "ఉజ్జయిని బృందం అందుబాటులోకి వచ్చిన వెంటనే వారు రాజ్‌గఢ్‌కు చేరుకున్నారు. నాలుగు గంటల ఆపరేషన్ తర్వాత మేము కోతిని పట్టుకున్నాము" అని ఆయన అన్నారు. బంధించబడిన కోతిని ఎక్కడ విడుదల చేస్తారనే దానిపై అధికారి మాట్లాడుతూ.. "దీన్ని దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలేస్తాం. అప్పుడే అది ప్రజలకు హాని కలిగించకుండా ఉంటుంది" అని స్పష్టం చేశారు.