- తలను గోడకేసి బాదింది.. ఏడుస్తోందని గొంతు పిసికింది...
- పాము కరిచి చనిపోయిందని నమ్మించే యత్నం
- నాగర్‌కర్నూల్ జిల్లా కొత్తకుంటపల్లిలో అమానుషం
లింగాల, వెలుగు : వివాహేతర సంబంధం కొనసాగిస్తూ..ఫోన్లో మాట్లాడుతుంటే..ప్రతి విషయాన్ని తండ్రికి చెప్తోందని ఓ తల్లి తన కూతురిని కిరాతకంగా చంపేసింది. పోలీసుల కథనం ప్రకారం..నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం కొత్తకుంటపల్లి గ్రామానికి చెందిన తగిలి తిరుపతయ్య నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సౌండ్, డెకరేషన్పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య మహేశ్వరి ముగ్గురు పిల్లలతో కలిసి కొత్తకుంటపల్లిలో ఉంటోంది. కొంతకాలంగా ఇదే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ప్రతిరోజు అతడితో ఫోన్లో మాట్లాడుతోందని రెండో కూతురు జాను(6) తండ్రికి చెబుతోంది.
దీంతో బిడ్డపై కోపం పెంచుకుంది. గురువారం రాత్రి మహేశ్వరి గ్రామంలో ఓ బర్త్‌డే పార్టీకి వెళ్లి వచ్చింది. అప్పటికే బాగా తాగి ఉండడంతో పడుకుని ఉన్న జాను కనిపించగానే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పాపను లేపి ఇష్టమున్నట్టు కొట్టింది. ఎడమ చేతిని విరిచేసింది. తలను గోడకేసి బాదింది. దెబ్బలను విలవిల్లాడుతూ ఏడుస్తుంటే..అరుస్తోందని గొంతు నులిమి చంపేసింది. తర్వాత ఏమీ తెలియనట్టు పడుకోబెట్టింది. మిగతా ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉన్నా గాఢనిద్రలో ఉండడం వల్ల లేవలేదు. తెల్లారిన తర్వాత తన బిడ్డ పాము కరిచి చనిపోయిందని గ్రామస్తులను నమ్మించే ప్రయత్నం చేసింది.
వారు బాలిక బట్టలు మారుస్తుండగా దెబ్బలు కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. అచ్చంపేట సీఐ రవీందర్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం డెడ్‌బాడీని అచ్చంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. తాగిన తర్వాత తానేం చేశానో తెలియదని చెప్పిన మహేశ్వరి, పీఎస్‌కు తీసుకువెళ్లాక వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని తానే చంపినట్టు నేరాన్ని ఒప్పుకుంది. తండ్రి తిరుపతయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు.