రేపటి నుంచి మోతీమాత జాతర

  • రాష్ట్రంలోనే ఏకైక లంబాడీల జాతరగా ప్రఖ్యాతి
  • సంగారెడ్డి జిల్లా ఉప్పరపల్లి తండాలో సంబురాలు

సంగారెడ్డి, వెలుగు: రేపటి నుంచి మోతీమాత జాతర మొదలుకానుంది. కలరా సోకి మృతి చెందిన సాధారణ గిరిపుత్రిక మోతీఆడి.. భవానీ మాత అనుగ్రహంతో దేవతగా మారి నమ్ముకున్న భక్తులను కాపాడుతూ వస్తోంది. అందుకే ఆ తల్లి పేరుతో గిరిజనులు 30 ఏళ్లుగా జాతర నిర్వహిస్తున్నారు. ఈ జాతరే రాష్ట్రంలోనే ఏకైక లంబాడీల జాతరగా ప్రసిద్ధి గాంచింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం మొగుడంపల్లి మండలం ఉప్పరపల్లి తండాలో మోతీమాత అవతరించారు. ఈ నెల 12, 13 తేదీల్లో జాతర నిర్వహించడానికి గిరిజనులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. 

మోతీమాత చరిత్ర

మొగుడంపల్లి మండలం ఉప్పర్ పల్లి తండాకు చెందిన బిక్కునాయక్ రాథోడ్ కుమార్తె మోతీఆడికి, అదే మండలంలోని జాంగార్బౌలి తండాకు చెందిన జాదవ్ రేకునాయక్ తో 65 ఏళ్ల కింద  వివాహం జరిగింది. ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు కిషన్ రెండున్నర ఏళ్లు ఉండగా మోతీఆడి సొంత గ్రామమైన ఉప్పర్ పల్లి తండాలో కలరా వ్యాపించి కుటుంబ సభ్యులు చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న మోతీఆడి సంతానాన్ని వెంటబెట్టుకొని పుట్టింటికి వెళ్లింది. 

అక్కడ ఆమెకు కలరా సోకి మృత్యు ఒడిలోకి చేరే ముందు ఆమెకు భవానీ మాత అనుగ్రహం కలిగి నీవు ఇక్కడే ఈ చెట్ల కింద సమాధిగా ఉండి తండా ప్రజలను కాపాడమని సూచించింది. కొన ఊపిరితో ఉన్న మోతీఆడి నోటి నుంచి వచ్చిన మాటలను కుటుంబ సభ్యులు గ్రహించి అక్కడే ఆమెను సమాధి చేశారు. అప్పటినుంచి ఆ ప్రాంతం మోతీమాతగా పేరుగాంచింది. ఆమె మహిమలు అందరికీ తెలియడంతో కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి గిరిజనులు ఆమెను దర్శించుకునేందుకు తరలి వచ్చేవారు.

30 ఏళ్ల కింద  గుడి నిర్మాణం

మోతీమాత ఆలయం 30 ఏళ్ల కింద నిర్మించారు. గిరిజనులు, భక్తులు చందాలు వేసుకొని గుడి నిర్మాణం చేసి మోతీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి మరిగమ్మ మోతీమాత ఆలయంగా ప్రసిద్ధిలోకి వచ్చింది. పిల్లలు లేని దంపతులు ఈ దేవాలయానికి వచ్చి మొక్కుకుంటే పిల్లలు పుడతారని గిరిజనుల నమ్మకం. 

ALSO READ : ఆదిలాబాద్​ నిర్మల్​ మంచిర్యాల జిల్లాలో ఘనంగా వైకుంఠ ఏకాదశి

దీంతో కొత్తగా పెళ్లైన వారు మోతీమాతను దర్శించుకుని పూజలు చేసి ముడుపులు కడుతుంటారు. కోరికలు నెరవేరాలని ఆలయ ఆవరణలో ఉన్న చెట్టుకు కొబ్బరికాయలు కట్టి యజ్ఞ హోమాలు చేస్తారు. మోతీమాత జాతరకు భక్తులు భారీగా తరలి వస్తారు. పూజారులు, గిరిజన పెద్దల సమక్షంలో ఆమెకు పూజలు చేసి జాతర ప్రారంభిస్తారు. ఆలయం ఎదుట యజ్ఞ హోమంలో పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తారు. 

భారీగా ఏర్పాట్లు

మోతీమాత జాతర మహోత్సవాలకు భారీగా ఏర్పాట్లు చేశాం. రాష్ట్రంలోనే ఈ జాతరను పెద్దదిగా గుర్తించారు. ప్రభుత్వం తరఫున అన్ని వసతులు కల్పించారు. అవసరం ఉన్నచోట రోడ్లు వేయించి అక్కడక్కడ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈసారి జరిగే జాతరకు పెద్ద ఎత్తున భక్తులు రానున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు.- జాదవ్ కిషన్, పూజారి మోతీమాత కుమారుడు