రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తే కేటీఆర్ కు కడుపు మంట ఎందుకు? : చామల కిరణ్ కుమార్ రెడ్డి

 రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తే కేటీఆర్ కు కడుపు మంట ఎందుకు? : చామల కిరణ్ కుమార్ రెడ్డి
  • ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

మోత్కూరు, యాదాద్రి, శాలిగౌరారం, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తే కేటీఆర్ కు కడుపు మంట ఎందుకని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను చూసి కేటీఆర్ కు కడుపు మండితే.. ఇది తాగి మంట చల్లార్చుకోవాలని మీడియాకు ఆయన ఈనో ప్యాకెట్లు చూపించారు. మోత్కూరు మున్సిపల్ కేంద్రంలోని గెస్ట్ హౌస్ లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు రెండు సార్లు దావోస్ లో పర్యటించారని తెలిపారు. మొదటిసారి రూ.45,200 కోట్లు, ఇప్పుడు లక్షా 78,950 కోట్లు పెట్టుబడులు తెచ్చారని చెప్పారు.

అమెజాన్, విప్రో, ఇన్ఫో, స్కైరూట్ ఏరో స్పేస్, మెగా ఇంజినీరింగ్, ఫినిక్స్, అగ్నిటెక్, యూనిలీవర్ వంటి ప్రపంచంలో పేరొందిన కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని వివరించారు. పదేండ్ల బీఆర్​ఎస్​ కాలంలో కేటీఆర్ తొమ్మిసార్లు దావోస్ వెళ్లొరని, రాష్ట్రానికి మాత్రం పెట్టుబడులు తేలేదని విమర్శించారు. పదేండ్లు కేసీఆర్ కు ఫాం హౌజ్లో పడుకోవడమే సరిపోయిందని, ఆయనకు దావోస్ అంటేనే తెలియదని ఎద్దేవా చేశారు. కేటీఆర్ తన బావ హరీశ్​రావును డామినేట్ చేసేందుకు సీఎంలా ఫీలవుతున్నాడని విమర్శించారు.

ఇప్పటికైనా కేటీఆర్​తన పద్దతి మార్చుకోవాలని సూచించారు. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మోత్కూరులోని కొండగడపకు చెందిన కృష్ణమూర్తి కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న ఎంపీ చామల, ఎమ్మెల్యే మందుల సామేల్ మోత్కూరుకు వెళ్లి కృష్ణమూర్తి, ఆయన కొడుకు వెంకన్నను పరామర్శించారు.  శాలిగౌరారం మండలం ఉప్పలంచ గ్రామ మాజీ సర్పంచ్ బండారు మల్లయ్య కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు.